Anagani Satya Prasad on AP Annual Budget 2024 :ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేడు ప్రారంభమయ్యాయి. ఈ ఉదయం అసెంబ్లీలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ 2024-25 ఏడాదికి రూ.2.94 లక్షల కోట్లతో వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌పై పలువురు స్పందించారు.
తల్లికి వందనం, ఉచిత బస్సు పథకానికి ఈ బడ్జెట్లో నిధులు :ఎన్నికల హామీల అమలుకు అద్దం పట్టేలా బడ్జెట్ ఉందని మంత్రి అనగాని సత్య ప్రసాద్ తెలిపారు. అభివృద్ధి, సంక్షేమం మేళవింపునకు ప్రతిబింబంగా ఉన్న బడ్జెట్ అని అన్నారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆలోచనల మేరకు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవులు అద్భుతమైన బడ్జెట్‌ను ప్రవేశపెట్టారని తెలిపారు.
సంపద సృష్టించాలన్న సీఎం ఆలోచనలను ఆచరణలో పెట్టే బడ్జెట్ ఇదని అనగాని సత్య ప్రసాద్ ప్రశంసించారు. సూపర్ సిక్స్ పథకాల అమల్లో భాగంగా మరో రెండు పథకాలైన తల్లికి వందనం, ఉచిత బస్సు పథకానికి ఈ బడ్జెట్లో నిధులు కేటాయించడం సంతోషకర విషయంగా పేర్కొన్నారు. రాష్ట్రాన్ని అన్నపూర్ణగా మార్చేందుకు నీటి పారుదల శాఖకు గత ప్రభుత్వం కంటే రెండు రెట్ల అదనపు నిధులు కేటాయించడం రైతుల్లో ఆనందాన్ని నింపుతుందని తెలిపారు. రైతులకు ఆదాయాన్ని పెంచే పథకాలకు కూడా ఆరు నుండి పది రెట్లు నిధులు పెంచారని ఆయన అన్నారు.
రూ.2.94 లక్షల కోట్లతో ఏపీ వార్షిక బడ్జెట్ - శాసనసభలో ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్
స్వర్ణ ఆంధ్ర ప్రదేశ్ స్థాపనకు పునాది : స్వర్ణ ఆంధ్ర ప్రదేశ్ స్థాపనకు తాజా బడ్జెట్ పునాదని శాసనమండలి పక్ష నేత యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. ఈ బడ్జెట్ ఇప్పటికీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పాలనలో ఆర్థిక సంక్షోభం కొనసాగింపును ప్రతిబింబిస్తోందన్న ఆయన, అందుకే దీనికి పెద్దగా ప్రాముఖ్యత లేదని అన్నారు. ఇది గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అందించిన 2.89 లక్షల కోట్ల నుంచి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 2.94 లక్షల కోట్లకు పెరుగుదల మాత్రమేనని తెలిపారు. ఆర్థిక సంవత్సరంలో రెండు ప్రభుత్వాల మధ్య మార్పు కేవలం 8000 కోట్లు (2.87%) మాత్రమేనని అన్నారు. ద్రవ్యోల్బణ రేటుకు సమానం కాదని యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు.
రాష్ట్ర ఆర్థిక రథం గాడిన పెడతాం :ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొదటి పూర్తి స్థాయి బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ (Payyavula Keshav) శాసన సభలో ప్రవేశపెట్టారు. మొత్తంరూ.2.94లక్షల కోట్లతో పద్దు సమర్పించారు. ఇందులో రెవెన్యూ వ్యయాన్ని 2లక్షల34 వేలకోట్లుగా మూలధన వ్యయాన్ని 32 వేల 712 కోట్లుగా పేర్కొన్నారు. రెవెన్యూ లోటు 34 వేల 743 కోట్లు, ద్రవ్య లోటు 68 వేల 743 కోట్లుగా ఉండొచ్చని, ఉండొచ్చని అంచనా వేశారు. రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తి - జీఎస్డీపీలో రెవెన్యూ లోటు 4.19 శాతం, ద్రవ్య లోటు 2.12 శాతంగా ఉండొచ్చని వివరించారు. వైఎస్సార్సీపీ సర్కార్ అరాచకాల వల్లే రాష్ట్ర ఆర్థిక రథం అగాథంలో కూరుకుపోయిందని, దాన్ని మళ్లీ గాడిన పెడతామని పయ్యావుల వివరించారు.
రైతులకు గుడ్‌న్యూస్ - వ్యవసాయ రంగానికి రూ.43,402 కోట్ల కేటాయింపులు