Minister Anagani Satya Prasad Comments On YS Jagan : మోసం గురించి జగన్ చెప్తుంటే ఐదు కోట్ల ఆంధ్రులు నవ్వేస్తున్నారని మంత్రి అనగాని సత్యప్రసాద్ ఎద్దేవా చేశారు. తన ఐదేళ్ల పాలనలో జగన్ చేసిన మోసాలను భరించలేకే జనం వేసిన మొట్టికాయకులకు ఇంకా వాపులు కూడా తగ్గలేదని వ్యాఖ్యానించారు. ఆకాశంలో ఉన్న జగన్ అహంకారాన్ని ప్రజలు గత ఎన్నికల్లో అథఃపాతాళానికి తొక్కేసారని విమర్శించారు. కానీ ఇంకా మారని జగన్‌ను, ఆయన పార్టీని ఈసారి బంగళాఖాతంలో కలపడం ఖాయమని మంత్రి అనగాని వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలను పీల్చి పిప్పి చేసి వారి సబ్ ప్లాన్ నిధులను మళ్లించి జేబులు నింపుకున్న జగన్ రెడ్డికి సంక్షేమంపై మాట్లాడే అర్హత లేదని మండిపడ్డారు.
జగన్ మాటలు విడ్డూరంగా ఉన్నాయి : కంపెనీలను బెదిరించి రాష్ట్రం నుండి వెళ్లగొట్టి ఏపీ పరువును అంతర్జాతీయంగానూ తీసిన విషయం లూలూ లాంటి కంపెనీలే తెలుపుతున్నాయన్నారు. ఏపీ బ్రాండ్‌ను చంద్రబాబు, లోకేశ్ పునః నిర్మిస్తుండగా మరోవైపు జగన్ అలవాటు ప్రకారం అమరావతిపై విషం కక్కుతున్నాడని దుయ్యబట్టారు. సీఎంగా ఉన్నప్పుడు కనీసం ఎమ్మెల్యేలను కూడా కలవని జగన్ ఇప్పుడు కార్యకర్తలకు అండగా ఉంటానని అనటం విడ్డూరంగా ఉందన్నారు. అది నమ్మే పరిస్థితిలేకే వారి నాయకులు పార్టీ మారుతున్నారని మంత్రి అనగాని సత్యప్రసాద్ విమర్శించారు.