Matrimony Frauds in Hyderabad :పెళ్లి సంబంధం కుదుర్చుకోవాలంటే అటు ఏడుతరాలు ఇటు ఏడుతరాలు చూడాలనేది ఒకప్పటి మాట. నేడు టెక్నాలజీ పుణ్యమా అని ఆన్లైన్లోనే సంబంధాలు మాట్లాడుకుంటున్నారు. అసలు సమస్య ఇక్కడే ఎదురవుతోంది. తాజాగా ఓ మాయలేడి నకిలీ వివరాలతో ప్రొఫైల్ ఏర్పాటు చేసింది. తనను సంప్రదించిన వారిని మాటల్లోకి దింపి వారి దగ్గర నుంచి అందినకాడికి దోచుకుంటోంది. ఈ ఘటన హైదరాబాద్లో వెలుగులోకి వచ్చింది.
ఆ మహిళ వయసు 35-40 మధ్య ఉంటుంది. వివిధ కారణాలతో భార్య దూరమై జీవితభాగస్వామి కోసం వెదికే పురుషులకు గాలం వేస్తోంది. వారికి దగ్గరై అందినంత దోచుకుంటోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ఈ కిలేడీ బారినపడి ఎంతో మంది మోసపోయినట్టు ఓ పోలీసు అధికారి పేర్కొన్నారు. ఒకరిద్దరు బాధితులు తమ బాధను పంచుకున్నా ఫిర్యాదు చేసేందుకు ముందుకు రాలేదని ఆయన తెలిపారు. మ్యాట్రిమోనీ వెబ్‌సైట్లలో పరిచయమైన యువతి, యువకుడు దగ్గరై బహుమతి కోరినా ఇచ్చేందుకు ప్రయత్నించినా ఆచితూచి స్పందించాలని సూచించారు. మాయలేడి వలపు వలతో ఎలా చిత్తు చేస్తుందనేది తెలుసుకోండి.
చెప్పాలంటే సిగ్గుచేటండీ ఇదీ 55 సంవత్సరాల వ్యక్తి నోటి నుంచి వచ్చిన మాట. బాపట్ల జిల్లాకు చెందిన మధ్య వయస్కుడు. మంచి ఉద్యోగం సమాజంలో గౌరవం అన్నీ ఉన్నాయి. అనారోగ్యంతో బాధపడుతున్న భార్య కారణంగా మనోవేదన అనుభవిస్తున్నాడు. భార్య సూచనతో మ్యాట్రిమోనీ సైట్‌లో రెండో వివాహానికి సిద్ధపడ్డాడు. ఈ క్రమంలోనే మహిళల వివరాలు పరిశీలించాడు. వారిలో హైదరాబాద్కి చెందిన ఒక మహిళ పరిచయమైంది.