Medical and Health Minister Satyakumar Inspection in Vijayawada GGH :విజయవాడ జీజీహెచ్‌లో వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ ఆకస్మిక తనిఖీలు చేశారు. ఓపీ కౌంటర్లు పరిశీలించారు. రోగులతో మాట్లాడారు. ఔషధాలు అందుబాటులో ఉన్నాయా ? లేవా ? అని ఆరా తీశారు. స్ట్రెచర్లు, వీల్ ఛైర్లపై రోగులను తీసుకెళ్లే సిబ్బంది కొరత ఉందని, త్వరలోనే నియామకాలు చేపడతామన్నారు. సమాచారం ఇవ్వకుండా సెలవుపై వెళ్లిన ఆసుపత్రి సిబ్బందికి షోకాజ్ నోటీసులు ఇవ్వాలని మంత్రి ఆదేశించారు. పేదలకు వైద్య సేవలను మరింత చేరువ చేసేందుకు చర్యలు చేపడుతున్నామంటున్న మంత్రి సత్యకుమార్‌తో ముఖాముఖి.
'ఆస్పత్రిలో శుభ్రత చాలా బాగుంది. సిబ్బంది ఓపికగా పని చేస్తున్నారు. మంచి ఆహారం అందిస్తున్నారు. కొంత సిబ్బంది కొరత ఉంది. దానికోసం నియామకాలు చేపడుతున్నాం. వాస్తవానికి గతం కంటే పరిస్థితులు మెరుగయ్యాయి. మరిన్ని సదుపాయాల కోసం కృషి చేస్తాం. డాక్టర్లు అందరూ పేషెంట్లతో ఎలా వ్యవహరిస్తున్నారని వాళ్లను అడిగి తెలుసుకున్నాను. సిబ్బంది తమను చాలా బాగా చూసుకుంటున్నారని తెలిపారు. ఓపీ సేవలు త్వరితగతిన జరుగుతున్నాయన్నారు. మందులు తీసుకునే దగ్గర కాస్త క్యూ ఉంది. దాని నివారణకు మరో రెండు కౌంటర్లు ఏర్పాటు చేస్తాం.'- వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్