Adulteration Chilli Powder :సమాజంలో కల్తీ వ్యాపారాలు అధికమైపోయాయి. హానికర పదార్థాలు తయారు చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు అక్రమార్కులు. వీరి దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. దీంతో వారికి అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. తాజాగా కల్తీ కారం వ్యవహారం వెలుగులోకి వచ్చింది. మిర్చి తొడిమలు, తుక్కు కాయలు, తాలుకాయలు వర్షానికి తడిసి రంగు మారి చీడపీడలతో దెబ్బతిన్న మిరపకాయలు వీటన్నింటినీ పొడిగా చేస్తారు. వాటికి రంగులు జోడిస్తారు. ఆ తర్వాత ఆకర్షణీయమైన సంచుల్లో నింపి మార్కెట్‌లోకి తెస్తున్నారు కల్తీ రాయుళ్లు.
గుంటూరు మిర్చియార్డు ఆసియాలోనే పెద్దది. ఇక్కడ రోజుకు కోట్లలో వ్యాపారం జరుగుతుంది. దీంతో అక్రమార్కులు పరిసర ప్రాంతాల్లోని కొన్ని మిల్లుల్లో హానికర రసాయనాలు, రంగులతో కల్తీ కారాన్ని తయారు చేస్తున్నారు. రకరకాల పేర్లతో రోజువారీ గిరాకీ ఉండే టిఫిన్ సెంటర్లు, రెస్టారెంట్లకు, హోటళ్లు, క్యాటరింగ్ పనులు చేసే కొంతమందికి అతి తక్కువ ధరకే అంటగడుతున్నారు. గుంటూరు కారానికి ఉన్న డిమాండ్‌ను ఉపయోగించుకుని కల్తీ రాయుళ్లు చెలరేగిపోతున్నారు.
తయారీ ఖర్చుకంటే తక్కువకే : పది కిలోల కారం కావాలంటే 12 నుంచి 12.50 కిలోల మిర్చిని మర పట్టించాలి. సగటున కిలో మిరపకాయల ధర రూ. 170 అనుకుంటే తొడిమలు, ఇతరత్రా వ్యర్థాలు పోగా కిలో కారం తయారీకి రూ. 220 వరకు ఖర్చు అవుతుంది. ప్యాకింగ్, రవాణా ఇతర ఖర్చులు, లాభం కలిపి కనీసం మరో రూ. 30 వేసుకున్నా కిలో రూ. 250కిపైగానే విక్రయించాలి. ప్రముఖ కంపెనీల కారం పొడి ధరలు మార్కెట్లో రూ. 270 నుంచి రూ. 400 వరకు ఉన్నాయి. కానీ స్థానికంగా కొంతమంది వ్యాపారులు కిలో కారం రూ. 150 నుంచి రూ. 200కే విక్రయిస్తున్నారు. అదే 25 కిలోల కారం బస్తా కొనుగోలు చేస్తే ఇంకా తక్కువ ధరకే వస్తోంది. ఎక్కువగా లూజుగానే విక్రయిస్తున్నారు.
నాసిరకం మిర్చితో :యంత్రాలతో మిరపకాయల తొడిమ తీస్తుంటారు. ఈ నేపథ్యంలోనే తొడిమలు, విత్తనాలు, మిర్చి తుక్కుతో కలిపి వృథా వస్తుంది. కోల్డ్ స్టోరేజీలు, మిర్చియార్డులో బస్తాలు అటూఇటూ మార్చే క్రమంలో కొన్ని కాయలు కిందపడి నలిగి తుక్కుగా మారిపోతుంటాయి. వీటిని కిలో రూ. 20 నుంచి రూ. 22 పెట్టి కొనుగోలు చేస్తున్నారు. వీటితో కారం తయారు చేసి రంగులు, రసాయనాలు, పామాయిల్, పొద్దు తిరుగుడు, వంటివి కలిపి ఎర్రగా ఉండేలా చూస్తున్నారు. ఈ యూనిట్లు తుక్కు నుంచి విత్తనాలు వేరే చేసే పేరుతో నడుస్తున్నాయి. దీంతో ఎవరికీ అనుమానం కలగడం లేదు.