Makar Sankranti Festival 2025: అబ్బో బస్సులన్నీ కిక్కిరిసిపోయాయి. రైళ్లు అయితే కిటకిటలాడిపోయాయి. ఇక విమానాలు అయితే వామ్మో అస్సలు ఖాళీలు లేవు. ఎలా అయితేనేం మొత్తానికి ఊరికి చేరుకున్నాం. ఈ మూడు రోజులూ స్నేహితులు, బంధువులు, చిన్న పిల్లలు ఇలా అందరితో సందడిగా గడిపేస్తున్నాం.
మీరంతా సంక్రాంతి పండుగను బాగా చేసుకుంటున్నారా? అమ్మ చేసిన అరిసెలు, అత్తమ్మ చేతి బోలెడు పిండివంటలు. చిన్ననాటి స్నేహితుల కబుర్లు వింటూ, వాటిని ప్రస్తుత తరం పిల్లలకు వివరిస్తున్నారా? ఎన్నో జ్ఞాపకాలతో తిరుగుపయనమవుతాము. మళ్లీ అక్కడకి వెళ్లిన వెంటనే అంతా మాములే. గందరగోళం నడుమ గజిబిజి పరుగులు. ట్రాఫిక్ జామ్‌లు. మళ్లీ సంవత్సరం తరువాతే సంక్రాంతిని జరుపుకునేది. అందుకే అంతటి ఆనందాన్నీ కేవలం ఈ మూడు రోజులకే సరిపెట్టకుండా, ఆ అనుభూతులను ఏడాదంతా గుర్తుండేలా నిర్మించుకుందాం.
మీ చిన్ననాటి అనుభవాలను పంచుకోండి: పట్టణాల్లో ఎవరికి వారే అన్నట్టుగా ఉంటున్నారు. అదే గ్రామాల్లో అయితే ఇంట్లోంచి బయటకు వస్తే అమ్మమ్మ, తాతయ్య, అత్తయ్య, మామయ్య, బాబాయ్, పిన్ని, పెదనాన్న, పెద్దమ్మ ఇలా అందరూ మన వాళ్లే. ఆ మమకారం, ఎవరెలా చుట్టాలు అవుతారు, మీ చిన్ననాటి జ్ఞాపకాలు, వాటితో సంబంధమున్న ప్రదేశాల అనుభవాలను పిల్లలకు తెలియజేయండి. ఆన్‌లైన్ స్నేహాలతో, పుస్తకాలతో బిజీబిజీగా ఉంటున్న మీ పిల్లలకు మీరు పంచే మధురానుభూతులు సాంత్వన కలిగిస్తాయి.
వారిని ఓసారి కలిసిరండి: చిన్నప్పుడు మీతో ఆటలాడుకున్నవారు, మీతో చదువుకున్న మీ స్నేహితులు, గ్రామంలో మీకు బాగా ఇష్టమైన వారు ఎవరైనా ఉంటే వారిని కలిసిరండి. వారి బాగోగుల గురించి అడిగి తెలుసుకోండి. వారి యోగక్షేమాలు తెలుసుకోండి. మీరు చిన్నప్పుడు చేసిన అల్లరి పనులను గుర్తుచేసుకుంటూ మనసారా నవ్వుకోండి. మీరు చదువుకున్న స్కూల్‌కి వెళ్లండి. వీలైతే స్కూల్‌కి మీ వంతుగా ఏదైనా సాయం చేయండి. మీ గుర్తుగా అక్కడ ఓ మొక్కను నాటండి. ఉపాధ్యాయులను సైతం కలిసేందుకు ప్రయత్నించండి. వారితో మాట్లాడి, వారి ఆశీర్వాదాలు తీసుకోండి.
పిల్లలకు మీరే చెప్పాలి: సంక్రాంతి సెలవులు పూర్తైన తరువాత తిరిగి రావడం అంటే పిల్లలకు ఎంతో కష్టంగా ఉంటుంది. తోటి పిల్లలతో ఆడుకున్న కొత్తకొత్త ఆటలు, ఊరి చెరువు అందాలు, అమ్మమ్మ కథలు, ఇలా అన్నింటినీ మిస్ అవుతామనే బాధ వారిలో ఉంటుంది. కేవలం సంక్రాంతి పండుగకు మాత్రమే కాకుండా మరిన్ని సందర్భాల్లో వారికి ఆ ఆనందాన్ని అందించండి. మీ ఊరి జ్ఞాపకాలు, మీ చిన్నప్పటి జ్ఞాపకాలను తరచూ వారితో పంచుకోండి. చుట్టాల ఇళ్లకు తీసుకెళ్లండి. వారిని మీ పిల్లలకు పరిచయం చేయండి.