Mahashivratri Celebrations 2025 :తలచినంతనే వశమయ్యే భక్తవత్సలుడు అడిగినంతలో కరుణించే దయామయుడు నిర్గుణుడు నిర్వికారుడు. ఆర్తజనరక్షకుడు అసురులకూ వరాలిచ్చే భోళాశంకరుడు. సత్యస్వరూపుడు ఆనందతాండవుడు ఆలిని తనలో ఇముడ్చుకున్న అర్ధనారీశ్వరుడు. మనిషిలోని శక్తిని ఉప్పొంగించి ఆధ్యాత్మిక శిఖరానికి చేర్చే పర్వదినమే మహా శివరాత్రి. ఈ విశిష్ట రోజున పరమశివుడిని పూజిస్తే కుటుంబం చల్లగా ఉంటుందని భక్తజనం నమ్ముతారు. ఈ పర్వదినం ఉపవాస, జాగరణలే కాదు మరెన్నో ఆధ్యాత్మిక, జీవన సందేశాలున్న సుదినం. ఆది అంతం లేని లింగరూపంలో అవతరించిన పరమేశ్వరుడిని బ్రహ్మా, మురారి, సురులు అర్చించిన రోజు.
రాష్ట్రవ్యాప్తంగా శివరాత్రి సందడి నెలకొంది. నీలకంఠుడి దర్శనం కోసం భక్తులు తెల్లవారుజాము నుంచే బారులు తీరారు. దీంతో శివాలయాలు కిటకిటలాడుతున్నాయి. దేవాలయాల ప్రాంగణాలు శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. స్వామివారి దర్శనభాగ్యంతో భక్తులు తన్మయత్వం చెందుతున్నారు. శివుడికి పూజలు, రుద్రాభిషేకాలు చేస్తున్నారు.వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయాల వద్ద అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు.