Maha Shivaratri Celebrations 2025 in AP : మహాశివరాత్రిని పురస్కరించుకుని ప్రముఖ శైవక్షేత్రం కోటప్పకొండలోని త్రికోటేశ్వరుడి దర్శనానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. భద్రతపరంగా కట్టుదిట్ట చర్యలకు పోలీసులు సన్నద్ధమయ్యారు. చేదుకో కోటయ్యా, ఆదుకో రావయ్యా అంటూ భక్తులు ఆలయం వద్దకు చేరుకుంటున్నారు. మంగళవారం కొన్ని బాలప్రభలు, మొక్కుబడి ప్రభలు కొండకు చేరుకున్నాయి. కోటప్పకొండ పరిసర గ్రామాల నుంచి కొండ వద్దకు భారీ ప్రభలు తరలివస్తున్నాయి. స్వామి దర్శనానికి వచ్చే భక్తుల ఆకలి తీర్చడానికి అన్నదాన సత్రాలు సిద్ధమయ్యాయి. స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు తాగునీరు, మజ్జిగ ప్యాకెట్లు అందించేలా ఏర్పాట్లు చేశారు.
వేకువన 3 గంటల నుంచే : మంగళవారం అర్ధరాత్రి తర్వాత ఒంటిగంటకు శ్రీత్రికోటేశ్వర స్వామికి తొలి అభిషేకం (మహన్యాసపూర్వక రుద్రాభిషేకం) నిర్వహించి, బుధవారం వేకువన 3 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. గురువారం మధ్యాహ్నం వరకు నిరంతరాయంగా భక్తులు స్వామిని దర్శించుకోవచ్చు. భక్తులు అభిషేక మండపంలో స్వామికి అభిషేకాలు చేయించేందుకు అవకాశం కల్పిస్తారు. నేటి సాయంత్రం 4 గంటల సమయంలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. బుధవారం అర్ధరాత్రి తర్వాత లింగోద్భవకాలంలో ప్రత్యేకంగా ఏకాదశ మహారుద్రాభిషేకం చేస్తారు.
200 మందికి పైగా పోలీసులు : దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన పెదకాకాని మల్లేశ్వరస్వామి దేవస్థానంలో తెల్లవారుజామున 3 గంటల నుంచే దర్శనానికి అనుమతిస్తున్నట్లు దేవస్థాన ఉప కమిషనర్ గోగినేని లీలాకుమార్ తెలిపారు. ఉదయం 8 గంటలకు నుంచి అభిషేకాలు నిలిపి వేయనున్నట్లు తెలిపారు. భ్రమరాంబ అమ్మవారు స్వర్ణ కవచాలంకరణలో భక్తులకు దర్శనం ఇస్తారన్నారు. రాత్రి 10.30 గంటలకు లింగోద్భవ కాలంలో స్వామివారికి అభిషేకం, 12 గంటలకు గజవాహనంపై ఎదుర్కోలోత్సవం, కల్యాణం వైభవంగా నిర్వహించనున్నట్లు చెప్పారు. సీఐ నారాయణస్వామి ఆధ్వర్యంలో 200 మందికి పైగా పోలీసులు బందోబస్తు నిర్వహించనున్నారు.