Lulu Group Chairman Meets Chandrababu :కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పెట్టుబడిదారులు ఏపీ వైపు చూస్తున్నారు. వైఎస్సార్సీపీ పాలనలో మధ్యలో ఆగిపోయిన చాలా పరిశ్రమలు మళ్లీ ప్రారంభమవుతున్నాయి. కొత్త పరిశ్రమలను స్థాపించేందుకు కూడా సర్కార్ సమాయత్తమవుతోంది. ఈ క్రమంలోనే రాష్ట్రం నుంచి వెళ్లిపోయిన పారిశ్రామిక వేత్తలతో ఇప్పటికే సంప్రదింపులు కొనసాగుతుండగా, మరోవైపు నూతన ఇండ్రస్టీస్, పెట్టుబడులు రాబట్టేందుకు కసరత్తు చేస్తోంది. దీంతో ఐదు సంవత్సరాలుగా ఉపాధి అవకాశాలు లేక నానావస్థలు పడిన నిరుద్యోగులకు కూటమి రాకతో ఆశలు చిగురిస్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే గత ప్రభుత్వం రాష్ట్రం నుంచి తరిమేసిన లులు సంస్థ సీఎం చంద్రబాబు చొరవతో మళ్లీ తిరిగి ఏపీకి రానుంది. ఈ మేరకు ఇవాళ ముఖ్యమంత్రితో లులు గ్రూప్ ఛైర్మన్ యూసఫ్ అలీ భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడులపై చర్చించారు. విశాఖలో మాల్, హైపర్ మార్కెట్ ఏర్పాటుపై చంద్రబాబుతో వారు చర్చించారు. విజయవాడ, వైజాగ్, తిరుపతిలోనూ మల్టీప్లెక్స్‌ల ఏర్పాటుపై చర్చ సాగింది.
Lulu Group Investments in AP : లులు బృందంతో సానుకూల వాతావరణంలో చర్చలు జరిగినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ఏపీ అభివృద్ధిలో పాల్గొనే భాగస్వాముల కోసం ఎదురు చూస్తున్నామని చెప్పారు. పెట్టుబడుల ఆకర్షణ పట్ల ప్రభుత్వం సానుకూల దృక్పథంతో ఉందన్నారు. లులు ప్రతినిధులకు పూర్తిస్థాయి మద్దతిస్తామని చంద్రబాబు ఎక్స్ వేదికగా ప్రకటించారు.