Low Salaries for RBK Employees: విత్తనం నుంచి పంట విక్రయం వరకు రైతు భరోసా కేంద్రాల్లోనే. దేశానికే ఇవి ఆదర్శమంటూ సీఎం జగన్ బాకాలూదుతున్నారు. రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసిన సీఎం జగన్ ఇంద్రుడు, చంద్రుడని చూపించేందుకు ఉన్నతాధికారులు శక్తికి మించి ప్రయత్నిస్తున్నారు. జాతీయ, అంతర్జాతీయ ప్రతినిధులను తీసుకొచ్చి విజయవాడ చుట్టుపక్కల ఎంపిక చేసిన నాలుగైదు ఆర్‌బీకేలను చూపించి గొప్పలు చెప్పుకున్నారు.
వీరెవరూ క్షేత్రస్థాయి సమస్యలు, ఉద్యోగుల ఇబ్బందులను పట్టించుకోవడం లేదు. ఆర్‌బీకే ద్వారా 22 రకాల సేవలందించాలని ప్రభుత్వం నిర్దేశించింది. వ్యవసాయ సహాయ సంచాలకుల నుంచి ఆర్‌బీకే సిబ్బంది వరకు అందరికీ లక్ష్యాలు పెట్టి హడలెత్తిస్తోంది. వ్యవసాయ కోర్సులు చదివి ఆర్‌బీకేల్లో పనిచేసే ఎంపీఈఓలకు నెలకు ఇచ్చేది కేవలం 12 వేలే. అదీ మూడు నెలలకూ జమ కాని పరిస్థితి.
రాష్ట్రంలో 10 వేల 778 ఆర్‌బీకేలను ఏర్పాటు చేశారు. వాటిలో ఒక్కో కేంద్రంలో వ్యవసాయ లేదా ఉద్యాన లేదా పట్టు, పశుసంవర్థక లేదా మత్స్యశాఖల సహాయకులను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంటే ఒక్కో కేంద్రంలో ఇద్దరు సహాయకులు పనిచేయాలి. వాస్తవానికి వ్యవసాయ, ఉద్యాన శాఖల పరిధిలో 2 వేల 200కుపైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కొన్నిచోట్ల ఒక్కో వీఏఏ లేదా వీహెచ్‌ఏలు 2, 3 చోట్ల బాధ్యతలు నిర్వహించాల్సి వస్తోంది. పశుసంవర్థక, మత్స్యశాఖల పరిధిలో 4 వేల 750 పోస్టులు ఖాళీయే. ఇటీవల పశుసంవర్థక శాఖ పరిధిలోని కొన్ని పోస్టుల్ని భర్తీ చేసే ప్రక్రియ మొదలైంది.
ఉద్యోగాలు ఇచ్చింది బతకమనా? చావమనా? - మమ్మల్ని ఉద్యోగస్తులుగా గుర్తించండి : ఆర్బీకే ఉద్యోగులు
రైతు భరోసా కేంద్రంలో ఏం కొనాలన్నా ముందే సొమ్ము చెల్లించాలి. తర్వాత వాటిని తెచ్చిస్తారు. అవీ కొన్ని సంస్థలవే ఉంటాయి. 40 నెలల్లో పరిశీలిస్తే సగటున ఒక్కో రైతు భరోసా కేంద్రం పరిధిలో నెలకు 12.60 లీటర్ల పురుగు మందులు, 750 బస్తాల ఎరువులు అమ్మారు. విత్తన విక్రయం మరింత తక్కువ. అయితే ప్రభుత్వం మాత్రం అమ్మకాలు ఘనంగా ఉన్నాయని చెప్పాలంటూ సిబ్బందిపై ఒత్తిడి పెంచుతోంది. మార్కెట్‌లో డిమాండ్ ఉన్న ఎరువులు, పురుగుమందులు ఏవి వచ్చినా ముందు వైసీపీ నేతలకు ఇవ్వాల్సిందే. కొన్నిచోట్ల వాళ్లు డబ్బు చెల్లించకుండానే వారు తీసుకెళుతున్నారు.