Low Pressure in Bay of Bengal: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. ఉత్తర తమిళనాడు- దక్షిణ కోస్తాంధ్రకు సమీపంలో అవరించిన అల్పపీడనం రాగల 24 గంటల్లో అదే ప్రదేశంలో బలహీనపడి కొనసాగే అవకాశం ఉందని వాతావరణ అధికారి తెలిపారు. దీని ప్రభావంతో కోస్తాంధ్రలో మోస్తారు నుంచి తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది. రేపు ప్రకాశం, తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ విభాగం తెలిపింది. గంటకు 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని కోస్తాంధ్ర తీరం వెంట ఓడరేవులకు మూడో నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించారు.
వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ:అల్పపీడన ప్రభావంతో బాపట్ల జిల్లా తీర ప్రాంతాల్లో తెల్లవారుజాము నుంచి చిరు జల్లులు పడుతున్నాయి. చీరాల, బాపట్ల, కారంచేడు, పర్చూరు, మార్టూరు, వేటపాలెం, బాపట్ల, పీవీపాలెం, నగరం, సంతమాగులూరు, నిజాంపట్నం, రేపల్లె ప్రాంతాల్లో ఉదయం నుంచి వర్షం కురుస్తుంది. వాతావరణ శాఖ భారీ వర్ష హెచ్చరికల నేపథ్యంలో రేపల్లె నియోజకవర్గం నిజాంపట్నం హార్బర్ వద్ద అధికారులు మూడో నంబర్ ప్రమాద సూచికను పోర్ట్ ఎగురవేసి మత్స్యకారులను వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేసారు. ఇప్పటికే సముద్రంలో వేటకు వెళ్లిన బోట్లు తిరిగి వచ్చి జెట్టికే పరిమితం అయ్యాయి. మరో వైపు అకాల వర్షాల వలన రైతులు ఆందోళన చెందుతున్నారు. వాతావరణ మార్పుల వలన వరి కోతలు కోసిన రైతులు వేగంగా కుప్పలు వేస్తున్నారు.