LORD GANESHA IN MANGALAGIRI: వాహనదారులకు హెల్మెట్ లేకపోతే ఏ పోలీసులైనా బండి పక్కన ఆపమంటారు. ట్రిపుల్ రైడింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే ఫొటో కొట్టి ఫైన్ వేస్తారు. కారులో వెళ్తూ సీటు బెల్టు పెట్టుకోకపోతే చలానా వేస్తారు. కానీ మంగళగిరి పోలీసులు మాత్రం రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ఓ వినూత్న అవగాహన కార్యక్రమం నిర్వహించారు. యముడు వేషధారణలో ఓ వ్యక్తి వచ్చి హెల్మెట్ పెట్టుకోకపోతే ప్రాణాలు తీసేస్తానంటూ బెదిరించగా, పెట్టుకున్నవారిని వినాయకుడి వేషం వేసిన వ్యక్తి దీవించారు.
ఈ సంభాషణ పై నుంచి కిందకొచ్చిన యముడు, వినాయకుడు మధ్య జరిగినది కాదు. ప్రజలు నిబంధనలు పాటించకుండా వాహనం నడిపితే పైకి పోతారని హెచ్చరించడానికి వచ్చిన ప్రాణ హరుడు, గణేషుడి వేషధారణలో ఉన్న వ్యక్తుల మధ్య మాటలు. రోజురోజుకీ రోడ్డు ప్రమాదాలు పెరిగి ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. అలా జరగకుండా హెల్మెట్ పెట్టుకోవాలి, సీట్ బెల్టు వేసుకోవాలి, మద్యం సేవించి వాహనం నడపొద్దు, సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయొద్దని చెప్పడానికి గుంటూరు జిల్లా మంగళగిరి పోలీసులు ఈ వినూత్న అవగాహన కార్యక్రమం చేశారు.
మంగళగిరి పోలీసులతో కలిసి రోడ్లపైకి వెళ్లిన యముడు, వినాయకుడి వేషధారణ వేసిన వ్యక్తులు పలువురు వాహనదారుల వద్దకు వెళ్లి రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించారు. సెల్‌ఫోన్ మాట్లాడుతూ కారు నడుపుతున్న ఓ వ్యక్తి వద్దకు వెళ్లిన పోలీసులు యమపాశం అతని మెడకు చుట్టి నిర్లక్ష్యంగా వాహనం నడిపితే యముడి వద్దకు వెళ్తావంటూ హెచ్చరించారు.
హెల్మెట్ పెట్టుకోకుండా స్కూటీ నడుపుతున్న వ్యక్తి వద్దకు వెళ్లిన యముడు నాతో రా తీసుకుపోతా అంటూ చేయి పట్టుకుని లాగారు. బైక్‌పై వెళ్తున్న కొందరు యువకుల వద్దకు వెళ్లి శిరస్త్రాణం పెట్టుకుంటావా? నాతో వస్తావా? అని అడిగారు. ప్రయాణ సమయంలో హెల్మెట‌్ మన ప్రాణాలకు రక్షణ కల్పిస్తుందని చెప్పారు. ఇద్దరు అమ్మాయిల వద్దకు వెళ్లి, హెల్మెట్ పెట్టుకుంటాం అని ప్రామిస్ చెప్పేదాకా వారి స్కూటీని ముందుకు కదలనివ్వకుండా ఆపారు. మరోవైపు వారితో పాటు వచ్చిన పోలీసులు మీ మీద ఆధారపడి ఉన్న కుటుంబం గురించి ఆలోచించాలంటూ వాహనదారులకు సూచించారు.