Lord Ganesh Immersion Celebrations in Kurnool District :కర్నూలు నగరం ఆదివారం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. లంబోదరుడి శోభాయాత్ర ఘనంగా సాగింది. ఈ నిమజ్జన ఉత్సవాలు యువతీ యువకుల కేరింతలు, నృత్యాల నడుమ శోభాయమానంగా ఘనంగా ప్రారంభమయ్యాయి. ఊరేగింపు శోభాయాత్ర చూసేందుకు నగరం నుంచేకాక చుట్టుపక్కల ప్రాంతాల నుంచి లక్షలాది మంది తరలిరావడంతో నగరం జనసంద్రమైంది.
కర్నూలులో వినాయక నిమజ్జనం వైభవంగా జరిగింది. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చిన గణనాథులు గంగమ్మ చెంతకు చేరారు. నగరంలో ఈ ఏడాది 2 వేలకు పైగా వినాయకుల విగ్రహాలు ఏర్పాటు చేశారు. వీటన్నింటికీ 9 రోజుల పాటు పూజలు నిర్వహించిన అనంతరం ఆదివారం నిమజ్జనం చేశారు.
Ganesh Nimajjanam 2024 :తొలుత పాత నగరంలోని రాంబొట్ల దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన గణనాథుడి ఊరేగింపు ప్రారంభమైంది. మంత్రి టీజీ భరత్ వినాయకుడికి ప్రత్యేక పూజలు చేసిన తర్వాత బాణాసంచా మోతల నడుమ శోభాయాత్ర జరిగింది. ఓల్డ్ సిటీలోని మిగిలిన వినాయకులు రాంబొట్ల గణపయ్యను అనుసరించాయి. నగర వాసులు పెద్ద ఎత్తున ఈ శోభాయాత్రలో పాల్గొన్నారు. ఆట పాటలతో ఉత్సాహంగా పార్వతీ తనయుడిని గంగమ్మ చెంతకు తరలించారు.