ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఈ సారికి పాతపద్ధతే - నీటి పంపకాల్లో కేఆర్ఎంబీ నిర్ణయం - KRMB MEETING KEY DECISIONS

ఏపీ, తెలంగాణల మధ్య పాత ఒప్పందానికి అనుగుణంగానే నీటి పంపకాలు చేయాలని కృష్ణాబోర్డు నిర్ణయం- నీటిని 50:50 కేటాయించాలన్న తెలంగాణ వాదనను వ్యతిరేకించిన ఏపీ

KRMB Meeting Key Decisions
KRMB Meeting Key Decisions (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 22, 2025, 9:35 AM IST

KRMB Meeting Key Decisions : ఏపీ, తెలంగాణల మధ్య పాత ఒప్పందానికి అనుగుణంగానే వచ్చే సంవత్సరంలోనూ నీటి పంపకాలు చేయాలని కృష్ణా బోర్డు నిర్ణయించింది. 50:50 కేటాయించాలని తెలంగాణ పట్టుబట్టగా అందుకు ఆంధ్రప్రదేశ్ కుదరదని స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో అంతర్గత నీటి వాడకం లెక్కలు తెలిసేలా టెలీమీటర్లు ఏర్పాటు చేయాలన్న తెలంగాణ ప్రతిపాదనను ఏపీ వ్యతిరేకించింది. కమిటీ ఏర్పాటు చేద్దామన్న బోర్డు నిర్ణయానికీ సమ్మతి తెలియజేయలేదు. బోర్డు ప్రధాన కార్యాలయాన్ని విజయవాడలో ఏర్పాటు చేసేందుకు బోర్డు అంగీకారం తెలిపింది. సమావేశంలో కొన్ని అంశాలపై వాడీవేడిగా వాదనలు జరిగాయి.

హైదరాబాద్‌లో బోర్డు ఛైర్మన్‌ అతుల్‌జైన్‌ అధ్యక్షతన కృష్ణానదీ యాజమాన్య బోర్డు 19వ సర్వసభ్య సమావేశం జరిగింది. ఏపీ నుంచి ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ ఎం.వెంకటేశ్వరరావు, అంతర్రాష్ట్ర విభాగం చీఫ్‌ ఇంజినీరు సుగుణాకరరావు, కృష్ణా ప్రాజెక్టులకు సంబంధించిన ఇతర సీఈలు సమావేశంలో పాల్గొన్నారు. తెలంగాణ నుంచి నీటిపారుదలశాఖ కార్యదర్శి రాహుల్‌ బొజ్జా, ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ అనిల్‌కుమార్‌ తదితరులు హాజరయ్యారు. నీటి పంపకాలపై సమావేశంలో బలంగా వాదనలు జరిగాయి. అందుబాటులో ఉన్న నీటిని 50:50 నిష్పత్తిలో రెండు రాష్ట్రాలకూ పంచాలని తెలంగాణ నీటిపారుదలశాఖ కార్యదర్శి రాహుల్‌ బొజ్జా పట్టుబట్టారు. ఈ విషయంపై ఇప్పటికే తాము ట్రైబ్యునల్‌లో గట్టిగా పోరాడుతున్నందున తాము ఈ వాటాకు తగ్గి నీటి పంపకాలకు అంగీకరించబోమన్నారు.

ప్రస్తుత విధానం 66:34 నిష్పత్తిలోనే నీటి పంపకాలు ఉండాలని ఏపీ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ ఎం.వెంకటేశ్వరరావు వాదించారు. ట్రైబ్యునల్‌ ప్రాజెక్టులకు నీటి పంపకాలు పూర్తి చేసిందని ఇప్పుడు ఏ ప్రాజెక్టుకు నీళ్లు తగ్గించుకోగలమని ప్రశ్నించారు. ట్రైబ్యునల్‌లోనూ తాము ఇది వ్యతిరేకిస్తున్నామన్నారు. ట్రైబ్యునల్‌ నిర్ణయం వెలువడే వరకు పాత ఒప్పందం కొనసాగించాలని బోర్డు నిర్ణయించింది. ఈ పంపకాలను త్రిసభ్య కమిటీ పర్యవేక్షిస్తుంది.

నీటి మీటర్ల ఏర్పాటుపైనా భిన్నాభిప్రాయాలు : ఆంధ్రప్రదేశ్‌ వాడుకుంటున్న నీటిని ఇతర బేసిన్లకు మళ్లిస్తున్నందున ఆ రాష్ట్రంలో అంతర్గత అవుట్‌లెట్‌ల వద్ద నీటిమీటర్లు ఏర్పాటు చేయాలని తెలంగాణ డిమాండ్‌ చేసింది. ఎక్కడెక్కడ నీటి మీటర్లను ఏర్పాటు చేయాలో ప్రతిపాదించింది. బొల్లాపల్లి, హంద్రీనీవాకు నీళ్లు తీసుకునే మల్యాల, హంద్రీనీవా కాలువల పొడవునా ఇలా అనేక ప్రదేశాల్లో నీటిమీటర్ల ఏర్పాటుకు ప్రతిపాదించింది. ఏపీలో నీటిమీటర్ల ఏర్పాటుకు అవసరమైన ఖర్చు తెలంగాణ భరిస్తుందని పేర్కొన్నారు.

ఇందుకు ఆంధ్రప్రదేశ్‌ సమ్మతించలేదు. మా నీటిని మేము ఎక్కడైనా వాడుకుంటాం. ఆ హక్కు మాకు ఉంది. ఇందుకు నీటిమీటర్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని ఈఎన్సీ వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. తెలంగాణలో ఎక్కడైనా నీటిమీటర్లు ఏర్పాటు చేయమని కోరవచ్చని ఆ రాష్ట్ర అధికారులు అన్నారు.

KRMB Meeting in Hyderabad : ఈ అంశాన్ని పరిష్కరించటానికి ఆరుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసేందుకు బోర్డు ఛైర్మన్‌ అతుల్‌జైన్‌ నిర్ణయించారు. ఈ కమిటీ ఏర్పాటునూ ఏపీ వ్యతిరేకించింది. కృష్ణా బోర్డు నుంచి ఇద్దరు, రెండు రాష్ట్రాల నుంచి మరో ఇద్దరు చొప్పున సభ్యులతో ఒక కమిటీ వేద్దామని కమిటీ ఏర్పాటును వ్యతిరేకిస్తే ఎలా అని బోర్డు ఛైర్మన్‌ అతుల్‌ జైన్‌ ప్రశ్నించారు. ఈ విషయంలో ప్రభుత్వ అభిప్రాయం తెలుసుకుంటే తప్ప తమ నిర్ణయం చెప్పలేమని ఈఎన్సీ వెంకటేశ్వరరావు తెలిపారు.

సమావేశంలో నాగార్జునసాగర్‌ కుడి వైపున సీఆర్ఫీఎఫ్​ను తొలగించాలని, లేదా సాగర్‌లో రెండు వైపులా సీఆర్ఫీఎఫ్ బృందాలను ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ డిమాండ్‌ చేసింది. ప్రస్తుతం ఆ రెజిమెంట్‌ను అలాగే కొనసాగిద్దామని కొద్ది రోజులు పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని బోర్డు ఛైర్మన్‌ వెల్లడించారు. విజయవాడలో 17,000ల చదరపు అడుగుల విస్తీర్ణంతో వసతి చూపిస్తే కృష్ణా బోర్డు ప్రధాన కార్యాలయాన్ని విజయవాడకు తరలిస్తామని ఛైర్మన్‌ అతుల్‌జైన్‌ పేర్కొన్నారు. ప్రభుత్వంతో సంప్రదించి తెలియజేస్తామని ఏపీ అధికారులు తెలిపారు. మిగిలిన అంశాలు అనేకం న్యాయస్థానాల పరిధిలో ఉన్నందున పెద్ద చర్చ సాగలేదు. విద్యుత్ ఉత్పత్తి పేరుతో తెలంగాణ ప్రాజెక్టులు ఖాళీ చేస్తున్న అంశంపైనా ఏపీ అభ్యంతరాలు తెలియజేసింది.


కృష్ణా నదీ జలాల వివాదం- అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్‌ను ఏ తీరాలకు చేర్చనుంది? - Krishna Water Dispute

గండికోటకు చేరిన కృష్ణా జలాలు- హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు - Krishna Water Reached in Gandikota

ABOUT THE AUTHOR

...view details