Youngman Makes Nano Bubble Generator in Kakinada:ఆక్వారంగం అంటేనే ఎన్నో ప్రతికూలతలతో కూడుకున్నది. ఆక్సిజన్, వ్యాధులు, విద్యుత్, వాతావరణం ఇలా తరచూ ఏదొక సమస్య వస్తూనే ఉంటుంది. మంచి దిగుబడులు రావాలంటే వాటిని అధిగమిస్తేనే సాధ్యమవుతుంది. ఈ సమస్యల నుంచి ఆక్వా రైతులను బయటపడేసే ఆలోచన చేశాడు ఆ యువకుడు. దాని కోసం దాదాపు రెండేళ్లు పరిశోధన చేసి మరీ నానో బబుల్ జనరేటర్ తయారు చేశాడు. మరి ఆ నానో బబుల్ ఎలా పని చేస్తుంది? దాని వల్ల ఉపయోగాలేంటో? మనమూ తెలుసుకుందాం.
ఆక్వా రైతులు తరచూ ఎదుర్కొనే సమస్య ఆక్సిజన్ అందించడం. నిరంతరం ఆక్సిజన్ అందిస్తేనే దిగుబడి బాగుంటుంది. ప్రస్తుతం పెడల్ ఏరియేటర్స్ ద్వారా ఆక్సిజన్ అందిస్తున్నా రు. కానీ, ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో ఈ ప్రక్రియ ఎంతో సవాల్‌తో కూడుకున్నది. ఈ నేపథ్యంలో క్లిష్ట పరిస్థితులు తట్టుకుని రైతులకు లాభం చేకూర్చే నానో బబుల్ జనరేటర్‌ను ఈ యవకుడు తయారు చేశాడు.
నేపథ్యం: కొల్లు నరేంద్ర స్వస్థలం కాకినాడ. డిప్లొమా అనంతరం బీటెక్ పూర్తి చేశాడు. నరేంద్ర కుటుంబీకులు, బంధువులు ఆక్వా సాగులో ఉన్నారు. కరోనా సమయంలో ఆక్సిజన్ కొరతతో ఇబ్బంది పడుతున్న రోగుల కోసం ఆక్సిజన్ జనరేటర్లు అందించేందుకు ప్లాంట్ ఏర్పాటు చేశాడు. అలా ఆక్వా సాగుకూ పూర్తిస్థాయిలో ఆక్సిజన్ అందించాలని అనుకున్నాడు.
ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు ఆక్వా సాగుకు ప్రసిద్ధి. కానీ, భిన్న వాతావరణం మధ్య చెరువులోకి ఆక్సిజన్ పంపడం కష్టం. పెడల్ ఏరియేటర్స్ ద్వారా ఆక్సిజన్ అందిస్తున్నప్పటికీ అవి చాలీ చాలక నష్టాల బారిన పడుతున్నారు. అంతేకాకుండా దీనికి విద్యుత్ వినియోగమూ అధికమవుతోంది. పరిష్కారంగా రెండేళ్లు పరిశోధన చేసిన నరేంద్ర నానో బబుల్ జనరేటర్‌ను తయారు చేశాడు.