Young Swimmer karthik :అందరి పిల్లలాగే ఆ యువకుడికీ ఆటలపై అమితమైన ఆసక్తి. దానికి అనుగుణంగానే విభిన్నమైన రోయింగ్, కనోయింగ్ లాంటి క్రీడలు ఎంచుకున్నాడు. అందులోని మెలకువలను వడివడిగా ఒక్కొక్కటి నేర్చుకున్నాడు. కానీ కరోనా ఆ కుర్రాడి ప్రాక్టీస్‌కి అడ్డంకులు సృష్టించింది. ఆ సమయంలో ఖాళీగా ఉండటం ఎందుకని సరదాగా స్విమ్మింగ్ మొదలు పెట్టాడు. క్రమంగా దానినే అభిరుచిగా మలచుకున్నాడు. ఇప్పుడు జాతీయ, అంతర్జాతీయ వేదికలపై పతకాలు సాధిస్తూ ఔరా అనిపిస్తున్నాడు ఆ చిచ్చరపిడుగు. మరి ఆ యువ స్విమ్మర్ గెలుపుకై అతని జీవితం ఎన్ని విధాలుగా మలుపులు తిరిగిందో తెలుసుకుందామా!
ఆటలు అనగానే టక్కున గుర్తుకు వచ్చేవి క్రికెట్, కబడ్డీ, ఫుట్‌బాల్. ఎందుకంటే చాలామంది వీటినే ప్రొఫెషనల్ గేమ్స్‌గా ఎంచుకుంటారు. ఐతే, కాస్త భిన్నంగా ఆలోచించాడీ యువకుడు. మొదట్లో రోయింగ్, కెనోయింగ్ క్రీడల్లో ప్రావీణ్యం సంపాదించాడు. కరోనా రాకతో తన దిశ మార్చుకుని స్విమ్మింగ్ వైపు అడుగులేశాడు. అనతికాలంలోనే జాతీయ, అంతర్జాతీయ వేదికలపై స్వర్ణ పతకాలు సాధిస్తునాడు.
కరోనా ప్రాక్టీస్‌కి కళ్లెం వేసింది:ఈ స్విమ్మర్ పేరు భవానీ కార్తీక్. పుట్టి పెరిగింది ఏలూరు జిల్లా జంగారెడ్డి గూడెంలో. ప్రస్తుతం దూరవిద్యలో డిగ్రీ చదువుతున్నాడు. చిన్నప్పటి నుంచి ఆటలంటే అమితమైన ఆసక్తి ఈ యువకుడికి. కానీ అందరిలా కాకుండా భిన్నమైన క్రీడలో రాణించలనేది కార్తిక్ తపన. అంతాసాఫీగానే సాగితే అది జీవితం ఎందుకవుతుంది. ఆ సమయానికి కరోనా వచ్చింది. కార్తిక్ ప్రాక్టీస్‌కి కళ్లెం వేసింది. ఏమాత్రం నిరుత్సాహ పడని ఈ యువకుడు తన దిశను మార్చుకున్నాడు. స్మిమ్మింగ్‌ని ప్రొఫెషనల్ గేమ్‌గా ఎంచుకోవాలని భావించాడు. కొన్ని రోజులు ఎర్రకాలువ జలాశయంలో రాజేష్ అనే కోచ్ దగ్గర ఈదడంలో తర్ఫీదు పొందాడు.
అంతే గాక జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ తరపున స్మిమ్మింగ్ కోచ్ గణేష్ వద్ద ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు కార్తిక్. అక్కడే స్విమ్మర్స్‌కి కావాల్సిన నైపుణ్యాలపై అవపోసన పట్టాడు. అప్పటి నుంచి వెనుతిరిగి చూసుకోలేదు. పాల్గొన్న ప్రతీ స్విమ్మింగ్ పోటీల్లో పతకాలు సాధిస్తూ ఔరా అనిపిస్తున్నాడు. సమస్యల కంటే సాధించాలనే తపన ఈ యువకుడిలో బలంగా నాటుకుంది. అందుకే బాల్యం నుంచి కంటి చూపు సమస్యతో బాధపడుతున్నా ఏనాడు అధైర్యపడలేదు. కోచ్‌ల సలహాతో పారా స్విమ్మింగ్‌లోకి అడుగుపెట్టాడు. మొదటిసారి బెంగుళూరు జరిగిన స్విమ్మింగ్ పోటీల్లో 3 విభాగాల్లో స్వర్ణ పతకాలు సాధించి శభాష్ అనిపించాడు.