JANASENA GLASS SYMBOL ISSUE: టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు కూటమిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్న నేపథ్యంలో జనసేనకి కేటాయించిన గాజు గ్లాసు గుర్తును అన్ని అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాల్లో ఇతరులెవరికి కేటాయించకుండా ఈసీని ఆదేశించాలని కోరుతూ టీడీపీ నేత వర్ల రామయ్య హైకోర్టులో దాఖలు చేసిన వ్యాజ్యంపై విచారణ సోమవారానికి వాయిదా పడింది. గురువారం జరిగిన విచారణలో ఈసీ తరఫు సీనియర్ న్యాయవాది అవినాశ్ దేశాయ్ వాదనలు వినిపించారు. ఇప్పటికే ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైందన్నారు. బుధవారం సాయంత్రానికే బ్యాలెట్ల ముద్రణ ప్రారంభమైందన్నారు.
భద్రతా దళాలకు ఎలక్ట్రానిక్ బ్యాలెట్లను ఇప్పటికే పంపామన్నారు. రాష్ట్రంలో 85 ఏళ్లు దాటిన వృద్ధులు ఎవరైతే ఇంటివద్ద ఓటు వేసేందుకు ఐచ్ఛికాన్ని ఇచ్చారో వారి నుంచి గురువారం పోస్టల్ బ్యాలెట్ల సేకరణ ప్రక్రియ ప్రారంభమైందని, ఎన్నికల ప్రక్రియలో న్యాయస్థానం జోక్యం చేసుకోకుండా ఆర్టికల్ 329(బి) నిషేధిస్తోందన్నారు. పిటిషనర్‌కు వ్యాజ్యం దాఖలు చేసే అర్హత లేదన్నారు. ఈ దశలో న్యాయస్థానం జోక్యం చేసుకుంటే ఎన్నికల ప్రక్రియకు ఆటకం కలుగుతుందని నివేదించారు.
జనసేన ఎన్నికల గుర్తుపై కోర్టు ఆదేశాలను ఈసీ తప్పుగా అర్థం చేసుకుంది: వర్ల రామయ్య - Varla Ramaiah met EC
మరోవైపు సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ స్పందిస్తూ, పిటిషనర్ నుంచి వివరాలు సేకరించి కోర్టుకు వెల్లడించేందుకు సమయం కావాలన్నారు. దీంతో వ్యాజ్యంపై విచారణను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.కృష్ణమోహన్ ప్రకటించారు. ఎన్నికల్లో పార్టీ గుర్తు కీలక పాత్ర పోషిస్తుందని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. ఈవీఎంలపై అభ్యర్థుల పేర్లు, పార్టీ గుర్తు మాత్రమే ఉంటుందన్నారు. చదువులేని ఓటర్లు పార్టీ గుర్తును చూసి ఓటు వేసే అవకాశం ఉందన్నారు.
గాజు గ్లాసును స్వతంత్ర అభ్యర్థులకు కేటాయిస్తే కూటమి అభ్యర్థులపై ప్రతికూల ప్రభావం పడుతుందన్నారు. ఎన్నికల ప్రక్రియను నిలువరించాలని తాము కోరడం లేదని, తమ వినతిపై తగిన నిర్ణయం వెల్లడించేలా ఈసీని ఆదేశించాలని కోరుతున్నామన్నారు. ఎన్నికల ముందు(ప్రీపోల్) చేసుకునే పొత్తుకు చట్టంలో గుర్తింపు లేదని ఈసీ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. గుర్తుల కేటాయింపు ఏ దశలో ఉందో కనుక్కొని చెప్పేందుకు విచారణను తాత్కాలికంగా వాయిదా వేయాలని కోరారు. అనంతరం జరిగిన విచారణలో బ్యాలెట్ల ముద్రణ, పోస్టుల్ బ్యాలెట్ల సేకరణ ప్రక్రియ ప్రారంభమైందని కోర్టుకు విన్నవించారు. దీంతో విచారణ సోమవారానికి వాయిదా పడింది.
స్వతంత్రులకు గ్లాసు గుర్తు కేటాయింపుపై ఈసీ వివరణ - అక్కడ ఆ గుర్తు కేటాయించం - JANASENA GLASS SYMBOL ISSUE
GLASS SYMBOL TO INDEPENDENTS: కాగా జనసేన పార్టీ పోటీలో లేని పలు అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తును ఈసీ కేటాయించింది. టీడీపీ, బీజేపీతో పొత్తుల్లో భాగంగా జనసేన 21 అసెంబ్లీ, 2 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేస్తోంది. జనసేన పార్టీ బరిలో లేని నియోజకవర్గాల్లో గాజు గ్లాసు గుర్తును ఫ్రీ సింబల్స్ జాబితాలో పెట్టిన ఈసీ, స్వతంత్ర అభ్యర్థులకు ఈ గుర్తును కేటాయించింది. మొత్తంగా 50కు పైగా అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాల్లో స్వతంత్రులకు, పలు చిన్న పార్టీల అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తును ఈసీ కేటాయించింది.
స్వతంత్రులకు గ్లాసు గుర్తు కేటాయిస్తే కూటమికి నష్టం- హైకోర్టులో టీడీపీ వాదనలు, సోమవారానికి వాయిదా - TDP Petition In AP High Court