Jagan Failed to Construction of Floating Jetty Chintapally : మాటలు చెప్పి పూట గడపటంలో జగన్‌కు మరెవరూ సాటిరారు. గంగపుత్రుల జీవితాల్లో వెలుగులు తీసుకొస్తా వారి అభ్యున్నతికి బాటలు వేస్తానంటూ చింతపల్లి ఫ్లోటింగ్ జెట్టీ శంకుస్థాపన సమయంలో జగన్ చెప్పుకొచ్చారు. పర్యాటకంగానూ అభివృద్ధి చేస్తామని ప్రగల్భాలు పలికారు. నాడు జగన్ చెప్పిన మాటలతో తమ జీవితాలు మారతాయని మత్స్యకారులు ఆశపడ్డారు. పునాదిరాయి వేసి సంవత్సరం గడిచినా సంబంధిత పనులు అడుగు ముందుకు పడకపోవడంతో నేడు ఆందోళన చెందుతున్నారు. అన్ని వర్గాలతో పాటు తమనూ జగన్ నమ్మించి నట్టేట ముంచారని వాపోతున్నారు.
విశాఖలో మళ్లీ తెగిన ఫ్లోటింగ్ బ్రిడ్జి - సందర్శకుల అనుమానాలు
Floating Jetty Pending :విజయనగరం జిల్లాలో సుమారు 21.44 కిలోమీటర్ల మేర సముద్ర తీరం ఉంది. చింతపల్లి వద్ద ఫ్లోటింగ్ జెట్టీ నిర్మాణం వల్ల సుమారు 4వేల మత్స్యకార కుటుంబాల్లోని 20 వేలమందికి మేలు జరుగుతుంది. జిల్లాలో గుర్తింపు పొందిన 711 మోటరైజ్‌డ్ ఫిషింగ్ బోట్లు, 417 సంప్రదాయ పడవలు ఉన్నాయి. ఒక్క చింతపల్లి ప్రాంతంలోనే 487 మోటరైజ్‌డ్ ఫిషింగ్ క్రాప్ట్స్, 361 సంప్రదాయ ఫిషింగ్ బోట్లు ఉన్నాయి. రాష్ట్రంలో పూడిమడక తరువాత, చింతపల్లే రెండో పెద్ద ఫిష్ ల్యాండింగ్ సెంటర్‌గా చెప్పొచ్చు. గంగపుత్రుల అభ్యర్థనలతో 6 ఎకరాల విస్తీర్ణంలో ఇక్కడ జెట్టీ నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయించింది. 23.73కోట్లు రూపాయల అంచనాతో గతేడాది మే 3న జగన్ భోగాపురం వద్ద జెట్టీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. శిలాఫలకం వేసి ఏడాది గడిచినా నిర్మాణ పనులు అడుగు ముందుకు పడకపోవడంతో స్థానిక మత్స్యకారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.