Investments and Industries in AP: కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ 'ఇన్వెస్ట్ ఇండియా'(Invest India) దేశంలోని రాష్ట్రాల ప్రత్యేకతలు, పెట్టుబడులకు ఉన్న అవకాశాల్ని వివరించింది. కానీ ఏపీ గురించి ప్రత్యేకంగా ఏం చెప్పాలో తెలియక అతిపెద్ద రాష్ట్రం అంటూ సరిపెట్టింది. ఇదీ ఐదేళ్ల జగన్ జమానాలో బలైన ఏపీ బ్రాండ్ వాల్యూ. ఏదైనా రాష్ట్రానికి పెట్టుబడులు రావాలంటే కచ్చితంగా బ్రాండ్ వాల్యూ ఉండాలి. ప్రభుత్వంపై విశ్వసనీయత ఆధారంగా ఆ బ్రాండ్ వాల్యూ పెరుగుతుంది.
పారిశ్రామికవేత్తలకు వేధించడమే ఏపీ బ్రాండ్ వాల్యూగా మార్చేసింది జగన్ సర్కార్. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే గత ప్రభుత్వం పరిశ్రమలకు కేటాయించిన స్థలాల్ని పునఃసమీక్షిస్తామంటూ కొందరు పారిశ్రామికవేత్తల్ని వేధించింది. ఫలితంగా పెట్టుబడిదారులు సుమారు రూ.లక్ష 24 వేల కోట్ల విలువైన పెట్టుబడి ప్రతిపాదనలను ఉపసంహరించుకుని రాష్ట్రం నుంచి తరిమేసింది.
ఇప్పటికే ఉన్న పరిశ్రమలను తనిఖీల పేరుతో వేధించింది. జగన్ ప్రభుత్వ వేధింపులతో అమరరాజా బ్యాటరీస్ సంస్థ తన రూ.9,500 కోట్ల ప్రతిపాదిత విస్తరణ ప్రాజెక్టుకు తెలంగాణలో టెంకాయకొట్టేసింది.! ఈ ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిన పరిశ్రమలకన్నా వెళ్లిపోయిన సంస్థలే ఎక్కువ. జగన్(CM Jagan) మాత్రం పెట్టుబడులు గణనీయంగా రాబట్టామంటూ పెట్టుబడిదారుల సదస్సుల్లో, అసెంబ్లీ సమావేశాల్లో డప్పు వేసుకుంటున్నారు.
ఐటీని చావుదెబ్బ కొట్టిన జగన్ సర్కార్- పెట్టుబడుల ఆకర్షణలో అట్టడుగున రాష్ట్రం
2019 జూన్ నుంచి 2022 ఆగస్టు వరకూ 46 వేల 280 కోట్ల రూపాయల పెట్టుబడులతో 99 భారీ కొత్త పరిశ్రమల ఏర్పాటయ్యాయని, మరో 55 భారీ పరిశ్రమలు వివిధ దశల్లో ఉన్నాయంటూ అసెంబ్లీలోనే అడ్డగోలు లెక్కలు చెప్పారు. వాస్తవానికి వాటిలో అత్యధికంగా గత ప్రభుత్వ హయాంలో ఒప్పందాలు కుదుర్చుకుని నిర్మాణం ప్రారంభించినవే. కానీ జగన్ సర్కారు మాత్రం ఆ ఘనతనంతటినీ తమ ఖాతాలో వేసుకుంటోంది.
తెలుగుదేశం హయాంలో ఏటా సగటున రూ.11 వేల 994 కోట్ల పెట్టుబడుల చొప్పున వస్తే వైఎస్సార్సీపీ సర్కారు హయాంలో రూ.12 వేల 702 కోట్లు వచ్చాయంటూ 2022 సెప్టెంబరు 20న అసెంబ్లీలో జగన్ వివరించారు. వైఎస్సార్సీపీ ఐదేళ్ల పాలనలో 311కు పైగా భారీ పరిశ్రమలు వచ్చాయంటూ 2023-24 వార్షిక బడ్జెట్ ప్రసంగంలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి(Minister Buggana Rajendranath Reddy) అసాధారణ లెక్కలు చెప్పుకొచ్చారు. 2022 ఆగస్టు వరకు ఉత్పత్తిలోకి వచ్చిన, నిర్మాణంలో ఉన్న భారీ పరిశ్రమల సంఖ్య 154గా ఉంది.
ఏపీకి పెట్టుబడులతో రావడానికి ఓ వైపు పారిశ్రామికవేత్తలు పారిపోతుంటే మరోవైపు ఇన్ని పరిశ్రమలు ఎలా వచ్చాయనేది అంతుచిక్కని ప్రశ్నలు! మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి మరో అడుగు ముందుకేసి చంద్రబాబు(TDP Chief Chandrababu)హయాంలో దావోస్ నుంచి వచ్చిన పెట్టుబడుల కంటే జగన్ తెచ్చిన పెట్టుబడులే ఎక్కువని అసెంబ్లీ వేదికగా పచ్చి అబద్ధాలు వల్లెవేశారు.