Changes in Inter Education System : వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ మొదటి సంవత్సరం పబ్లిక్ పరీక్షలను తొలగించాలని ఇంటర్మీడియట్ విద్యామండలి భావిస్తోంది. విద్యార్థులపై పరీక్షల ఒత్తిడిని తగ్గించాలనే లక్ష్యంతో కేవలం ద్వితీయ సంవత్సరం పబ్లిక్ పరీక్షను ఆ ఏడాది సిలబస్‌తో నిర్వహించాలని యోచిస్తోంది. ఇంటర్ విద్యలో నాలుగు ప్రధాన సంస్కరణలను ప్రతిపాదించింది.
సిలబస్, పాఠ్యపుస్తకాల సవరణ, కొత్త సబ్జెక్టు కాంబినేషన్లతో పాటు పరీక్షల మార్కుల కేటాయింపు విధానంలోనూ సంస్కరణలు తీసుకురాబోతోంది. ఈనెల 26వ తేదీలోగా తమ సలహాలు, సూచనలు ఇవ్వాలని విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యావేత్తలను కోరుతూ ప్రతిపాదిత సంస్కరణల వివరాలను ఇంటర్మీడియట్ బోర్డు వెబ్‌సైట్‌లో ప్రజలు పరిశీలించేలా అందుబాటులో ఉంచింది.
రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్య సిలబస్‌లో గత కొన్నేళ్లుగా ఎలాంటి సవరణలు జరగలేదు. 2012లో సైన్సు సబ్జెక్టుల్లో, 2014లో ఆర్ట్స్ సబ్జెక్టుల్లో, 2018లో భాష పాఠ్యాంశాల్లో మార్పులు జరిగాయి. జాతీయ కరికులమ్ చట్టం-2023 అనుసరించి ఇంటర్మీడియట్ విద్యలో సంస్కరణలు చేయాలని ఇంటర్మీడియట్ విద్యామండలి భావిస్తోంది. ఈ విద్యా సంవత్సరం నుంచి పదో తరగతిలో పాఠశాల విద్యాశాఖ NCERT పుస్తకాలను ప్రవేశపెట్టింది. అందుకు అనుగుణంగా 2025-26 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో విద్యాభ్యాసనకు ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సజావుగా సాగేందుకు NCERT పాఠ్యపుస్తకాలను ప్రవేశపెట్టబోతోంది.
ప్రస్తుత సిలబస్‌లో సవరణలు: తద్వారా నీట్-జేఈఈ వంటి జాతీయస్థాయి పరీక్షల సిలబస్‌కు అనుగుణంగా పోటీ పడేందుకు వీలుగా ప్రస్తుత సిలబస్‌లో సవరణలు అవసరమని భావిస్తోంది. దేశవ్యాప్తంగా ఇప్పటికే 15కిపైగా రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్ విద్యా ప్రణాళిక అమలులో NCERT పాఠ్యాపుస్తకాలు ప్రవేశపెట్టారు. సవరణలకు సంబంధించి విద్యారంగంలో అనుభవం ఉన్న విశ్వవిద్యాలయాల ఆచార్యులు, డిగ్రీ కళాశాల అధ్యాపకులు, జూనియర్ కళాశాల అధ్యాపకులతో కమిటీలు వేసి వారి సిఫార్సులకు అనుగుణంగా ప్రతిపాదనలు రూపొందించింది.
ఇంటర్నల్ మార్కుల విధానం: సైన్స్ విద్యార్థులకు ప్రస్తుతం రెండు భాషలు, నాలుగు ప్రధాన సబ్జెక్టులు కలిపి మొత్తం ఆరు, ఆర్ట్స్- భాష విద్యార్థులకు ఐదు సబ్జెక్టులున్నాయి. విద్యార్థుల నుంచి మానవీయ శాస్త్ర కోర్సులకు వివిధ రకాల సబ్జెక్టు కాంబినేషన్లు ఎంపిక చేసుకునే స్వేచ్ఛ ఇస్తున్నారు. అలాగే ఎక్కువ మంది నుంచి ఎంబైపీసీ కోర్సుకు డిమాండ్ ఉంది.