INS Arighat Will be Commissioned Soon: భారత నౌకాదళం త్వరలో మరో మైలురాయిని చేరుకోనుంది. పూర్తిగా అణు సామర్థ్యంతో కూడిన దేశ తొలి బాలిస్టిక్ క్షిపణి వ్యవస్థ కలిగిన జలాంతర్గామి ‘ఐఎన్‌ఎస్ అరిహంత్’ స్ఫూర్తి, డిజైన్, అనుభవంతో తయారుచేసిన మరో అణు జలాంతర్గామి ‘ఐఎన్‌ఎస్ అరిఘాత్’ను భారత నౌకాదళం నిర్మించింది.
అరిహంత్ మాదిరిగానే అరిఘాత్ నిర్మాణాన్ని సైతం తూర్పు నౌకాదళానికి చెందిన యుద్ధనౌకల స్థావరం విశాఖపట్నం నేవల్ డాక్‌యార్డులోని ‘షిప్ బిల్డింగ్ సెంటర్’లో (Shipbuilding Centre) 2011 డిసెంబరులో చేపట్టారు. తొలిదశ నిర్మాణం పూర్తైన తర్వాత 2017 నవంబరు 19వ తేదీన జలప్రవేశం చేయించారు.
అనంతరం అంతర్గత విభాగాల పరికరాల బిగింపు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రాడార్ వ్యవస్థ, ఆయుధ సంపత్తిని సమకూర్చడం వంటి కీలక పనులన్నింటినీ ఇప్పటికే పూర్తి చేశారు. సీ ట్రయల్స్ ప్రక్రియను సైతం పలు దఫాలుగా చేపట్టారు. ఈ సంవత్సరం సార్వత్రిక ఎన్నికల తరువాత కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రాజ్‌నాథ్‌సింగ్ ఆ మరుసటి రోజే విశాఖ నౌకాదళ స్థావరాన్ని సందర్శించారు.