Atchutapuram SEZ Reactor Blast Updates : అచ్యుతాపురం సెజ్‌లో ఎస్సెన్షియా ఫార్మా కంపెనీలో భారీ పేలుడు సంభవించిన ఘటనలో 17 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంపై పలు విషయాలు వెలుగు చూస్తున్నాయి. దీనికి అధికార యంత్రాంగ నిర్లక్ష్యమే ప్రధాన కారణమని సమాచారం. జీఓ నం. 156 ఆధారంగా గత వైఎస్సార్సీపీ సర్కార్ రాష్ట్రంలో వివిధ కంపెనీల్లో భద్రతా తనిఖీలు చేయించింది.
Atchutapuram Incident Updates :ఇందులో భాగంగా ఎసెన్షియా ఫార్మా కంపెనీ రియాక్టర్ పైపులైన్లు పాతవైపోయాయని అధికారులు కంపెనీ ప్రతినిధులకు తెలిపారు. లీకులు ఉన్నాయని వాటిని సరిచేయాలని వారికి అప్పట్లోనే నివేదిక అందించారు. భవిష్యత్‌లో ప్రమాదాలు జరగకుండా వాటిని మార్చుకోవాలని థర్డ్ పార్టీ ఆడిట్ రిపోర్టు ఆధారంగా కొన్ని భద్రతా సూచనలు చేశారు. అయితే ఈ అంశాలను పరిశీలించి అమలు చేసే బాధ్యతను విశాఖకు చెందిన పరిశ్రమల శాఖ డిప్యూటీ ఇన్‌స్పెక్టరు నిర్వహించలేదు.
నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికను అమలు చేయకపోవడంతోనే ఈ భారీ ప్రమాదం జరిగి 17 మంది కార్మికులు మరణించారు. భద్రతను గాలికొదిలేసిన అధికారులు కనీసం ఒక్కసారి కూడా ఎసెన్షియా ఫార్మా కంపెనీని సందర్శించలేదు. భద్రతాపరమైన లోపాలను సరిచేయాలని కంపెనీ ప్రతినిధులకు ఆదేశాలు ఇవ్వలేదంటే ఎంత నిర్లక్ష్యం ప్రదర్శించారో అర్థం చేసుకోవచ్చు.
ఎసెన్షియా ఫార్మాలో ఇదే నిర్లక్ష్యం :గతంలో విశాఖపట్నంలో సంచలనమైన ఎల్‌జీ పాలిమర్స్ కంపెనీ దుర్ఘటనలోనూ ఆడిట్ రిపోర్ట్‌ను పట్టించుకోకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని అప్పట్లో వైఎస్సార్సీపీ సర్కార్ నియమించిన హైపవర్ కమిటీ నివేదించింది. దీనిపై పర్యవేక్షించాల్సిన అధికారిపై అప్పటి ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. తూతూమంత్రంగా క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్లు ప్రకటించి చేతులు దులుపుకొంది. ఇదే నిర్లక్ష్యం ఇప్పుడు ఎసెన్షియా ఫార్మాలో ఏజీఎం స్థాయి ఉన్నతాధికారితో సహా 16 మంది మరణించడానికి ప్రధాన కారణమైంది.