Preparations Underway for Issuing New Ration Cards in Telangana :తెలంగాణలో రేషన్‌కార్డుల దరఖాస్తులకు త్వరలో మోక్షం లభించనుంది. సంక్రాంతి తర్వాత కొత్త కార్డులను జారీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అత్యాధునిక సాంకేతికతో కూడిన రేషన్ కార్డులను అర్హులకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రేటర్ పరిధిలో రేషన్ కార్డుల దరఖాస్తులు కొన్ని నెలలుగా పెండింగులో ఉన్నాయి. క్షేత్రస్థాయి పరిశీలన తరవాత వారిలో ఎంత మందికి కార్డులు దక్కుతాయన్నది స్పష్టత వస్తుందని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
సుమారు రెండున్నరేళ్ల కిందట రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించి అర్హులకు కార్డులను జారీ చేసింది. ఆ తర్వాత నుంచి కార్డులు జారీ చేసిన దాఖలాలు లేవు. గతంలో కార్డుల జారీ ప్రక్రియ తరచుగా జరిగేది. రాష్ట్ర ప్రభుత్వం కార్డుల జారీ ప్రక్రియను ఏకీకృతం చేసింది. దీంతో ఎప్పటికప్పుడు కాకుండా ప్రభుత్వం నిర్ణయం మేరకు కార్డులు జారీ చేస్తోంది.
అధికశాతం హైదరాబాద్‌లోనే :రేషన్ కార్డుల కోసం సుమారు 4.5 లక్షల దరఖాస్తులు పెండింగులో ఉన్నట్లు అధికారుల అంచనాలు వేస్తున్నారు. అధిక శాతం హైదరాబాద్ జిల్లా పరిధిలోనే ఉన్నట్లు చెబుతున్నారు. కొత్తగా జారీ చేసే కార్డులో ఎలక్ట్రానిక్ చిప్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఇప్పటికే సూత్రప్రాయంగా నిర్ణయించిన సంగతి తెలిసిందే.