Huge Response to Deepam-2 Free Gas Cylinder Scheme in ANdhra Pradesh :దీపం-2 పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్లకు భారీ స్పందన లభిస్తోంది. ఈ పథకం కింద సిలిండర్ల బుకింగ్‌కు గత నెల 29 నుంచి అవకాశం కల్పించారు. అప్పటి నుంచి సోమవారం వరకు రాష్ట్రవ్యాప్తంగా 16.82 లక్షల మంది లబ్ధిదారులు సిలిండర్లు బుక్ చేసుకున్నారు. వీటిలో సోమవారం వరకు 6.46 లక్షల సిలిండర్లు లబ్ధిదారులకు అందాయి. సిలిండర్లు డెలివరీ తీసుకున్న లబ్ధిదారుల ఖాతాల్లో మొత్తం రూ.16.97 కోట్లు జమైంది.
సోమవారం ఒక్కరోజే అత్యధికంగా 64,980 సిలిండర్లు బుక్ కాగా, 17,313 సిలిండర్లు డెలివరీ అయ్యాయి. గుంటూరు జిల్లాలో అత్యధికంగా 99,365 మంది సిలిండర్లు బుక్ చేసుకున్నారు. దీపం-2 పథకం కింద ఏటా 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందించే కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించిన సంగతి తెలిసిందే. బుకింగ్ జరిగాక పట్టణాల్లోని 24 గంటల్లో, గ్రామాల్లో 48 గంటల్లో సిలిండర్లు సరఫరా చేస్తున్నారు. ఆ తర్వాత 48 గంటల్లో లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమవుతున్నాయి.
ఫ్రీ గ్యాస్ సిలిండర్ కావాలా - ఈ కార్డులు తప్పనిసరి
అర్హులైన ప్రతి మహిళకు దీపం 2.0 పథకాన్ని అందిస్తామని, చిత్తూరు జిల్లాలో 5 లక్షల మందికి లబ్ధి చేకూరనుందని రాష్ట్ర పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల అభ్యున్నతి, సాధికారతకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఎన్నికల హామీలో భాగంగా అధికారంలోకి వచ్చిన వెంటనే పెంచిన పింఛన్ అందజేశామని, సూపర్ సిక్స్‌లో భాగంగా మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ప్రారంభించినట్లు వివరించిన సంగతి తెలిసిందే. గత ప్రభుత్వంలా బటన్ నొక్కి ప్రజలను మోసం చేసే ప్రభుత్వం తమది కాదని స్పష్టం చేశారు.
జేసీ శుభం భన్సల్ మాట్లాడుతూ ఈ-కేవైసీ ఇబ్బందులు ఉంటే వాటిని త్వరితగతిన పరిష్కరించి అర్హులకు దీపం లబ్ధి చేకూరేలా చేస్తామన్నారు. నగరపాలిక కమిషనర్ మౌర్య మాట్లాడుతూ దీపం 2.0 పథకం మహిళలకు ఒక వరమని తెలిపారు. అనంతరం లబ్ధిదారులకు సిలిండర్లను అందజేసిన విషయం విదితమే.
ఉచిత గ్యాస్ సిలిండర్‌కు వేళాయే - శ్రీకాకుళంలో సీఎం, ఏలూరులో డిప్యూటీ సీఎం