Huge Number of Devotees in Temples due to Karthika Masam :కార్తిక మాసం రెండో సోమవారాన్ని పురస్కరించుకొని రాష్ట్రంలోని ఆలయాలన్నీ భక్తులతో కిక్కిరిశాయి. శంకరుడి ఆలయాలన్నీ శివనామస్మరణతో మార్మోగాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు పుణ్యస్నానాలాచరించి ముక్కింటికి ప్రత్యేక పూజలు చేశారు. కార్తీక మాసంలో రెండో సోమవారం సందర్భంగా నంద్యాల జిల్లా ప్రముఖ శైవ క్షేత్రం మహానందిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. ఆలయంలో స్వామివారికి అభిషేకాలు చేశారు. ఆలయ ఆవరణలో పలు చోట్ల దీపాలు వెలిగించి భక్తిని చాటుకున్నారు. ఆలయ అధికారులు ఉపవాస భక్తులకు పాలు అందజేశారు.
ప్రత్యేక బస్సులు నడిపిన ఆర్టీసీ : కార్తీక సోమవారం సందర్భంగా APSRTC నంద్యాల డిపో నుంచి పంచ శైవ క్షేత్ర దర్శిని పేరుతో మహానంది, ఓంకారం, భోగేశ్వరం, యాగంటి ఆలయాలకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. నంద్యాల ప్రాంతంలో వెలిసిన నవనంది క్షేత్రాలైన ప్రథమనంది, నాగనంది, సోమనంది, శివనంది, సూర్యనంది, కృష్ణ నంది, గరుడ నంది, వినాయక నంది, మహానంది ఆలయాలను భక్తులు పోటెత్తారు. కార్తీక మాసంలో శైవ క్షేత్రాల దర్శనం ఎంతో శుభకరం అని వేదపండితులు తెలిపారు.
కార్తిక మాసం శ్రవణ నక్షత్రం - ఈ రోజు దీపారాధన చేస్తే కలిగే ఫలితమిదే!
తెల్లవారుజాము నుంచే పోటేత్తిన భక్తులు : కార్తిక మాసం సందర్భంగా శ్రీకాళహస్తీశ్వరాలయానికి భక్తులు పోటెత్తారు. శ్రీ వాయులింగేశ్వర స్వామి సమేత జ్ఞాన ప్రసూనాంభికా దేవిని దర్శించుకునేందు బారులు తీరారు. ఆలయ ప్రాంగణంలోని మృత్యుంజయ స్వామికి అర్చకులు అభిషేకాలు నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లాలోని ప్రసిద్ధి శివాలయాలకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే భక్తులు ముక్కంటిని దర్శించుకుని పూజలు, అభిషేకాలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. ఉండ్రాజవరంలోని గోకేశ్వరస్వామి ఆలయంలో భక్తులు స్వామివారిని పాలతో అభిషేకించి పూజలు చేశారు. ఉండ్రాజవరం మండలం పాలంగిలోని శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో మహిళలు దీపారాధనలు చేసి కోనేరులో వదిలారు.
గోదావరి తీరాన భక్తుల పుణ్యస్నానాలు : పశ్చిమగోదావరి జిల్లాలోని తణకు గోస్తనీ తీరాన ఉన్న శ్రీసిద్దేశ్వరస్వామి ఆలయంలో తెల్లవారుజాము నుంచే భక్తులు స్వామివారి దర్శనానికి తరలివచ్చారు. తణుకు శివారు సజ్జాపురంలోని సోమేశ్వరస్వామి ఆలయం ప్రాంగణంలో భక్తులు దీపారాధనలు చేశారు. తణుకు మండలం తేతలి గ్రామంలో ఉన్న శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలో పూజలు, అభిషేకాలు నిర్వహించారు. కేంద్రపాలిత యానాంలో గౌతమీ గోదావరి తీరాన భక్తులు పుణ్యస్నానాలాచరించి దీపాలను నదిలోకి వదిలారు.
కార్తిక దీపం ఆ మూడు ప్రాంతాల్లో వెలిగించాలి - అవేంటో మీకు తెలుసా?
కార్తిక మాసంలో నారికేళ దీపాన్ని ఇలా వెలిగిస్తే - ధనపరమైన ఇబ్బందులు తొలగిపోతాయట!