Adulterated Edible Oils Cause Health Issues : రుచికరమైన ఆహార పదార్థాలు తయారు కావాలంటే తగినంత వంట నూనె ఉపయోగించాల్సిందే. రెండు దశాబ్దాల క్రితం వరకు ఎక్కువగా వేరుశనగ, పామాయిల్ నూనె వినియోగంలో ఉండేది. ప్రజలకు ఆరోగ్యంపై స్పృహ పెరగడంతో క్రమంగా పొద్దు తిరుగుడు, ఆలివ్, అవకాడో నూనెలు వాడుతున్నారు. అయితే ఏ నూనె అయినా అతిగా వినియోగించడం మంచిది కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే వంట నూనెలో కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. వీటి వినియోగం వల్ల ఊబకాయం, జీర్ణ సంబంధిత సమస్యలు, గుండె సమస్యలు ఎక్కువగా వస్తాయని నిపుణులు అంటున్నారు. రిఫైండ్, డబుల్ రిఫైండ్ అంటూ విక్రయించే నూనెల కంటే గానుగ నుంచి ఉత్పత్తి చేసే నూనెలు ఉత్తమమని వైద్యులు సూచిస్తున్నారు.
పశుమాంస వ్యర్థాల నుంచి తీసిన నూనె వినియోగం : ప్రస్తుతం వంట నూనెల వినియోగం పెరగడంతో కల్తీలు ఎక్కువయ్యాయి. కొందరు వ్యాపారులు లాభార్జనే ధ్యేయంగా నాసిరకం నూనెను ఖరీదైన వంట నూనెలో కలిపి విక్రయాలు చేస్తున్నారు. కొన్ని రెస్టారెంట్లు, హోటళ్లలో అయితే పశుమాంస వ్యర్థాల నుంచి తీసిన నూనెను ఉపయోగిస్తున్నట్లు ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడుల్లో బయటపడింది. ఈ నూనె వినియోగించడం వల్ల ఆహారం రుచి పెరుగుతుందనే ఉద్దేశంతో హానికారకమైన ఈ నూనెను ఉపయోగిస్తున్నట్లు అధికారుల దర్యాప్తులో తేలింది.
"సహజసిద్ధంగా ఏర్పడిన గానుగ నూనె ఆరోగ్యానికి మంచిది. నూనెలో రసాయానాలు కలిపితే అనారోగ్యానికి గురవుతామే తప్ప ఎలాంటి ఉపయోగం లేదు. నిత్యం ఒకే రకమైన ఆయిల్‌ను వాడకూడదు. అప్పుడప్పుడు మార్చాలి. బయట సమోసాలకు, బజ్జీలకి ఉపయోగించిన ఆయిల్‌ను వాళ్లు మళ్లీ ఉపయోగిస్తారు. దీనివల్ల ప్రజలు అనారోగ్యానికి గురి అయ్యే అవకాశం ఉంటుంది."- డాక్టర్ సాయి సతీశ్, సీనియర్ ఫ్రొఫెసర్, నిమ్స్
Adulterated Oils Are Harmful to Health: హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో పశుమాంస వ్యర్థాలను పెద్ద పెద్ద గిన్నెలో వేసి మంట పెట్టి దాని నుంచే వచ్చే నూనెను టిఫిన్ సెంటర్లు, హోటళ్లు, రెస్టారెంట్లలో విక్రయిస్తున్నారు. పశుమాంస వ్యర్థాల నుంచి తీసే నూనెను వినియోగించడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. టిఫిన్ సెంటర్‌లలో వడ, మిర్చిబజ్జీలు, సమోస, పూరి కోసం వంట నూనె పదే పదే వేడి చేసి ఉపయోగించడం అదే నూనెను తిరిగి ఇతర ఆహార పదార్థాలు వండటానికి వినియోగించడం వల్ల కాలేయం దెబ్బ తినడంతో పాటు ఉదర సంబంధిత సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు.