High Court On Traffic Violations: మోటారు వాహనాల చట్ట నిబంధనలను అమలు చేసేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ న్యాయవాది తాండవ యోగేష్ దాఖలు చేసిన పిల్‌పై హైకోర్టు విచారణ జరిపింది. రహదారులపై ముమ్మర తనఖీలు చేసి అక్కడికక్కడే జరిమానాలు విధించాలని, అప్పుడే వాహనదారుల్లో భయం ఉంటుందని వ్యాఖ్యానించింది. పోలీసులు రోడ్డుపై ఉంటే నేరం చేయడానికి సిద్ధమైన నేరగాళ్లు సైతం ఆ పనిని విరమించడమో లేదా వాయిదా వేయడమో చేస్తారని తెలిపింది. విచారణకు ఐజీ రవికృష్ణ నేరుగా కోర్టుకు హాజరయ్యారు. నిబంధనలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు.
జరిమానా 90 రోజుల్లో చెల్లించకుంటే: మోటారు వాహన చట్ట నిబంధనలను ఉల్లంఘిస్తే పోలీసులు కఠినంగా వ్యవహరిస్తారనే సందేశాన్ని ప్రజలకు పంపాల్సిన అవసరం ఉందని హైకోర్టు స్పష్టంచేసింది. సీసీ కెమేరాలపై ఆధారపడి చలానాలు విధించే విధానాన్ని తగ్గించాలంది. ద్విచక్ర వాహనం నడిపే వ్యక్తికే కాకుండా వెనుక కూర్చున్న వ్యక్తి సైతం హెల్మెట్ ధరించేలా చూడాలంది. జరిమానా సొమ్మును 90 రోజుల్లో చెల్లించకుంటే వాహనాన్ని జప్తు చేయవచ్చనే నిబంధనను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించింది.
నిర్థిష్ట సమయంలో చెలానాలను చెల్లించని వారి వాహనాలను సెక్షన్ 167 ప్రకారం సీజ్ చేయాలని, సెక్షన్ 206 ప్రకారం లైసెన్స్ రద్దు చేయాలని తేల్చిచెప్పింది. హెల్మెట్ ధరించని వారిని ఉపేక్షించవద్దని పేర్కొంది. హెల్మెట్ ధరించని కారణంగా ఈ ఏడాది జూన్ నుంచి మూడు నెలల్లో 667 మంది కన్నుమూశారని, ఈ సంఖ్య ఆందోళన కలిగిస్తోందని వ్యాఖ్యానించింది. హెల్మెట్‌ను తప్పనిసరి చేయాలని ఈ ఏడాది జూన్‌లో తామిచ్చిన ఆదేశాలను అమలు చేసి ఉంటే ఇన్ని ప్రాణాలు పోయేవికాదని పేర్కొంది.
వాహనదారులకు క్రమశిక్షణ లేదు:విజయవాడలో వాహనదారులకు క్రమశిక్షణ లేదంది. అనవసరంగా హారన్ మోగిస్తూ ప్రజలకు నరకం చూపిస్తున్నారని, నగరంలో ఎక్కడా నో హారన్ బోర్డులు కనిపించడం లేదంది. ఇదే చివరి రోజు అన్నంత వేగంగా దూసుకుపోతూ, విపరీతంగా హారన్లు మోగిస్తున్నారని తెలిపింది. అలాంటి వారిని పోలీసులు ఆపి తనఖీలు చేస్తున్న సందర్భం తాము ఒక్కటీ గమనించలేదంది.
ఈ మరణాలకు ఎవరిది బాధ్యత? - పోలీసులను ప్రశ్నించిన హైకోర్టు
నేనూ ఓసారి జరిమానా చెల్లించా: పోలీసులు వారి విధులను సక్రమంగా నిర్వహించడం లేదుకాబట్టే, వాహనదారులు ఉల్లంఘనలకు పాల్పడుతున్నారని మండిపడింది. స్పీడ్ గన్‌లు సరిపడినన్ని ఏర్పాటు చేయలేదంది. దిల్లీ, చండీఘడ్‌లలో పోలీసులు తనిఖీలు చేస్తూ అప్పటికప్పుడే ఉల్లంఘనలపై జరిమానాలు విధిస్తున్నారని గుర్తుచేసింది. వాహనం నడిపేటప్పుడు హైబీమ్ లైట్ వినియోగించినా జరిమానా విధిస్తారని తెలిపింది. తనకు ఈ విషయంలో ఓసారి జరిమానా విధించారని, అప్పటికప్పుడు సొమ్ము చెల్లించానని హైకోర్టు సీజే జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకుర్ తెలిపారు. రాష్ట్రంలో ఆటోలు పరిమితికి మించి పాఠశాల పిల్లల్ని రవాణా చేస్తున్నా పోలీసులు చర్యలు తీసుకోవడం ధర్మాసనం పేర్కొంది.