హైకోర్టులో సర్కారు అబద్ధాలు - క్షమాపణలు కోరిన ఏజీ శ్రీరామ్ High Court expresses displeasure over delay: కోర్టు భవనాల మౌలిక సదుపాయాల కోసం తమ వాటాగా రూ.30 కోట్లు జమచేసేశామని రాష్ట్రప్రభుత్వం హైకోర్టు సాక్షిగా చెప్పిన మాట అసత్యం తేలడంతో ధర్మాసనం విస్మయం వ్యక్తంచేసింది. ఈ వ్యవహారంపై తాము ఎలాంటి వ్యాఖ్యలు(కామెంట్స్) చేయదలుచుకోలేదని పేర్కొంది. కేంద్రప్రభుత్వం మొదటి విడత వాటాగా విడుదల చేసిన రూ45 కోట్లు, రాష్ట్రప్రభుత్వం వాటా రూ30 కోట్లు మొత్తం రూ75 కోట్లను వచ్చే బుధవారంలోపు తమ నియంత్రణలో ఉండే సింగిల్ నోడల్ ఏజెన్సీ(ఎస్‌ఎన్‌ఏ) అకౌంట్‌లో జమచేయాలని తేల్చిచెప్పింది. విచారణను ఈనెల 13కు వాయిదా వేసింది.
కోర్టు భవన నిర్మాణ ప్రాజెక్టుల పరిస్థితులపై దృష్టి: కోర్టుకు చెప్పిన విధంగా సొమ్ము జమచేయనందుకు క్షమాపణలు చెబుతున్నానని ఏజీ శ్రీరామ్ ధర్మాసనానికి నివేదించారు. ఉమ్మడి కృష్ణా జిల్లా గన్నవరంలో నూతన కోర్టు భవనాన్ని నిర్మించకపోవడంతో పాటుగా పాత కోర్టు భవనానికి మరమ్మతులు చేపట్టకపోవడాన్ని సవాలు చేస్తూ, గన్నవరానికి చెందిన దేవిరెడ్డి రాజశేఖరరెడ్డి, హైకోర్టులో 2022లో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరుపుతున్న హైకోర్టు రాష్ట్రంలో కోర్టు భవన నిర్మాణ ప్రాజెక్టుల పరిస్థితులపై దృష్టిసారించింది. కొన్ని భవనాలు అయిదేళ్ల కిందట ప్రారంభమైనా ఇప్పటికి పదిశాతం పనులు పూర్తికాలేదని కోర్టు అందోళన వ్యక్తంచేసింది. గతంలో ఈ వ్యాజ్యంపై విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ వాటా రూ.45 కోట్లు విడుదల చేసిందని న్యాయవాది యజ్ఞదత్ హైకోర్టుకు తెలిపారు. రాష్ట్రప్రభుత్వం సైతం తన వాటాగా రూ30 కోట్లు జమచేసిందని ఏజీ తరఫున ప్రత్యేక జీపీ సుమన్ తెలిపారు.
కోర్టు ఆవరణలో మాజీ ఎమ్మెల్యే వంశీ అనుచరుల దౌర్జన్యం - టీడీపీ నేతలపై దాడి
విస్మయం వ్యక్తంచేసిన ధర్మాసనం: ఈ వ్యాజ్యంపై హైకోర్టులో మరోసారి విచారించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సొమ్ము సంబంధిత ఖాతాలో జమకాలేదని ధర్మాసనం పేర్కొంది. ప్రత్యేక జీపీ సుమన్ స్పందిస్తూ హైకోర్టు బిల్లులు అప్‌లోడ్ చేస్తే సొమ్ము జమ అవుతుందని తెలిపారు. దీంతో ధర్మాసనం విస్మయం వ్యక్తంచేసింది. సొమ్ము జమ అయ్యిందని గత విచారణలో హైకోర్టు ముందు చెప్పారుకదా? అని ఏజీని ప్రశ్నించింది. అధికారులను అడిగి వివరాలు సమర్పిస్తానని ఏజీ మధ్యాహ్నానికి వాయిదా కోరారు. ఆ తర్వత జరిగిన విచారణలో ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ, పాలనపరమైన సమస్యవల్ల జమకాలేదన్నారు. రూ.45 కోట్లు గంటల వ్యవధిలో సంబంధిత ఖాతాలో జమ అవుతుందన్నారు. మరో రూ.30 కోట్లు మరో 15 రోజుల్లో జమ చేస్తామన్నారు. దీంతో ధర్మాసనం స్పందిస్తూ 30 కోట్లు జమచేశామని గత విచారణలోనే చెప్పారుకదా? అని పేర్కొంది. ఇంకా జమచేయకపోవడం ఏమిటని విస్మయం వ్యక్తంచేసింది.
రూ.75 కోట్లను జమచేయాల్సిందే: కేంద్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది జూపూడి యజ్ఞదత్ వాదనలు వినిపిస్తూ తమ వాటా సొమ్ము రూ.45 కోట్లను రాష్ట్ర ఖజానాలో ఇప్పటికే జమచేశామన్నారు. నిబంధనల ప్రకారం కేంద్ర ప్రభుత్వ వాటా సొమ్ము రూ 45 కోట్లు, రాష్ట్రప్రభుత్వ వాటా రూ.30 కోట్లు రెండు కలిపి ఒకేసారి సింగిల్ నోడల్ ఏజెన్సీ అకౌంట్‌లో జమచేయాలన్నారు. కేంద్ర వాటా సొమ్మును మాత్రమే జమచేయడానికి వీల్లేదన్నారు. యజ్ఞదత్ వాదనలు పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం, కేంద్రప్రభుత్వ వాటాతోపాటు రాష్ట్రప్రభుత్వం కూడా వాటాను జమచేస్తేనే ఆ సొమ్మును వినియోగించుకోవడానికి వీలుంటుందని తెలిపింది. మీవాటా(రాష్ట్రప్రభుత్వ) జమచేయకుండా కేంద్రం సొమ్మును మాత్రమే జమచేయడం ఏమిటని ఏజీని ప్రశ్నించింది. విచారణను వచ్చే వారానికి వాయిదా వేస్తూ ఈలోపు రూ.75 కోట్లను జమచేయాల్సిందేనని తేల్చిచెప్పింది. పిటిషనర్ తరఫున న్యాయవాది ఎమ్మార్కే చక్రవర్తి వాదనలు వినిపించారు.
ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు అసంతృప్తి - పార్టీ కార్యక్రమాలకు దూరం