Allu Arjun Petition in Telangana High Court About sandhya Theatre incident: సంధ్య థియేటర్ ఘటనపై అల్లు అర్జున్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. కేసును కొట్టేయాలంటూ హైకోర్టులో అల్లు అర్జున్ పిటిషన్ దాఖలు చేశారు. సంధ్య థియేటర్ వద్ద చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్‌పై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో తనపై నమోదైన కేసును కొట్టేయాలని అల్లు అర్జున్ పిటిషన్ వేశారు.
ఇదీ జరిగింది: ఈనెల 4వ తేదీన రాత్రి పుష్ప2 మూవీ ప్రీమియర్ షో జరిగింది. పుష్ప-2 ప్రీమియర్ షో కోసం హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ వద్ద ఉన్న సంధ్య థియేటర్ వద్దకు ఈ నెల నాలుగో తేదీ రాత్రి 9.40 గంటల సమయంలో అల్లు అర్జున్ వస్తున్నారని తెలిసి, ఆయనని చూసేందుకు అభిమానులు ఎగబడటంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ క్రమంలో భారీగా వచ్చిన అభిమానులను నిలువరించేందుకు పోలీసులు లాఠీ ఛార్జి చేశారు. దీంతో రేవతి అనే మహిళతో పాటు ఆమె కుమారుడు జనం కాళ్ల మధ్య నలిగిపోయారు. ఈ ఘటనలో ఇద్దరూ తీవ్ర గాయాలతో స్పృహ తప్పారు. వారిని గమనించిన పోలీసు సిబ్బంది వెంటనే బయటకు లాగి, ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే రేవతి మృతి చెందారు.