Heavy Rains Various District in AP :రాష్ట్రంలో కురుస్తోన్న భారీవర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాలను ముంపు నుంచి తప్పించేందుకు అధికారులు తగిన చర్యలు తీసుకున్నారు.
ప్రయాణికుల అవస్థలు :అల్లూరి సీతారామరాజు జిల్లా వై.రామవరం మండలం బొడ్డగుంట గ్రామానికి చెందిన వీరలక్ష్మికి పురిటి నొప్పులు రావటంతో ఆమెను కిలోమీటరు దూరం మోసుకెళ్లి అతికష్టం మీద వాగుదాటి అంబులెన్సు ఎక్కించారు. అంబులెన్సులోనే వీరలక్ష్మి మగబిడ్డకు జన్మనిచ్చింది. వరద ప్రభావంతో విశాఖ నుంచి బయలుదేరే పలు రైళ్లు రద్దుకావటంతో ప్రయాణికులకు పడిగాపులు తప్పటంలేదు. సుదూర ప్రాంతాలకు వెళ్లేందుకు రవాణా సదుపాయం లేదని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు. భారీ వర్షాల కారణంగా ఒంగోలులో ముంపు ప్రాంతాల్లో అధికారులు చర్యలు చేపట్టారు. కాలువలను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను తొలగించారు. పోతురాజు కాలువలో పేరుకుపోయిన చెత్త తొలగించారు.