Heavy Rains in Telangana :తెలంగాణలోని ఆరు జిల్లాలో కుండపోత వర్షాలు కురిశాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్ మండలం పెద్దంపేటలో కుంభవృష్టి వాన పడింది. గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకు అక్కడ 20.7 సెంటీమీటర్ల వర్షం కురిసింది. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలలం దేవులవాడలో 17.2సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. ఆ రెండు జిల్లాలతోపాటు కుమురం భీం ఆసిఫాబాద్, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, నిర్మల్ జిల్లాలో బీభత్సమైన వర్షం కురిసింది. విస్తారంగా కురుస్తున్న వర్షాలకు పలుచోట్ల వాగులూ వంకలు పొంగిపొర్లుతున్నాయి. కాలనీలు జలమయమయ్యాయి. కొన్నిచోట్ల రోడ్లు కొట్టుకుపోయాయి.
కోతకు గురైన రహదారులు :ఉమ్మడి ఆదిలాబాద్ వ్యాప్తంగా కుండపోత వర్షాలు పడ్డాయి. మంచిర్యాల జిల్లా భీమిని మండలం ఖర్జి భీంపూర్‌లో ప్రధాన రహదారి కొట్టుకుపోయి రాకపోకలు నిలిచిపోయాయి. కమలాపూర్ ప్రాజెక్టు ఎడమ కాల్వ కోతకు గురై నీరు వృథాగా పోతోంది. కోటపల్లి మండలం లింగన్నపేట -ఏదుల బంధం గ్రామాల మధ్య రహదారి కోతకు గురై పదికి పైగా గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయాయి. కాగజ్‌నగర్ పట్టణం, మండలంలోని గ్రామాల్లో వరద నీటితో ముంపునకు గురయ్యాయి. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇళ్లలోని సామాగ్రి అంతా పాడైపోయింది. తలదాచుకొని పరిస్థితి లేక రాత్రంతా జాగరణ చేశారు.
ఒకవైపు భారీ వర్షాలు - మరోవైపు తాగునీటి కష్టాలు - అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రజాప్రతినిధులు - Severe Water Crisis in Kurnool
చేపల వేటకు వెళ్లి గల్లంతు :ఉమ్మడి వరంగల్ జిల్లాలో గురువారం సాయంత్రం నుంచి శుక్రవారం వరకు విస్తృతంగా వర్షాలు కురిశాయి. కురుస్తున్న వానలకు జలవనరులు పొంగిపొర్లుతున్నాయి. గోదావరిలో వరద ప్రవాహం పెరుగుతోంది. ములుగు జిల్లా వెంకటాపురం మండలం తానిపర్తి గ్రామానికి చెందిన బానారి పగిడిద్దరాజు(43) గోదావరిలో చేపల వేటకు వెళ్లి గల్లంతయ్యారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం తెల్లవారుజామున దామెకుంట వైపు వెళ్తున్న సరుకు రవాణా వాహనం వరద ధాటికి కొట్టుకుపోయింది. డ్రైవర్ వాహనం పైకి ఎక్కి అరవడంతో స్థానికులు అతన్ని రక్షించారు. మహాముత్తారం మండలం కేశవాపూర్ సమీపంలోని పెద్దవాగు ఉప్పొంగింది. దీంతో ప్రధాన రహదారిలోని లోలెవల్ బ్రిడ్జి పై నుంచి వరద ప్రవహించడంతో శుక్రవారం మధ్యాహ్నం వరకు 10 గ్రామాల రవాణా స్తభించిపోయింది.
రాష్ట్రంలో దంచికొడుతున్న వానలు - ఉప్పొంగుతున్న వాగులు, వంకలు - Heavy Rains in AP 2024
పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్ :శనివారం ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి జిల్లాలో అతి నుంచి అత్యంత భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నట్లు వాతావరణ శాఖ అప్రమత్తం చేసి, ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తాయని ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది.
వానాకాలంలో పారిశుద్ధ్యం, అంటువ్యాధులపై జిల్లా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క సూచించారు. ఈ నెలాఖరులోపు గ్రామాల్లో మార్పు కనిపించేలా జిల్లా అధికారులు కార్యాచరణ రూపొందించుకోవాలని ఆదేశించారు. సరిగ్గా విధులు నిర్వర్తించని వారిపై చర్యలు తప్పవని హెచ్చరంచారు.
బంగాళాఖాతంలో వాయుగుండంగా మారిన అల్పపీడనం - రాష్ట్రంలో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు - AP Weather Report
శ్రీశైలంలో పెరుగుతున్న ప్రవాహం :కర్ణాటక, మహారాష్ట్రలో కురుస్తున్న వానలకు కృష్ణా, గోదావరి నదుల్లో ప్రవాహం విపరీతంగా పెరుగుతోంది. శుక్రవారం సాయంత్రానికి జూరాల నుంచి 37,907 క్యూసెక్కులు శ్రీశైలం జలాశయానికి విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయానికి 32 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదు అవుతోంది. ఎగువన ఆలమట్టికి వస్తున్న వరదను దిగువకు వదులుతున్నారు. నారాయణపూర్ నుంచి 68వేల క్యూసెక్కులు జూరాల వైపు వదులుతున్నారు.
తాగునీటి విడుదల :నాగార్జునసాగర్ ఎడమకాల్వ పరిధిలో తాగునీటి అవసరాల కోసం నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎన్నెస్పీ ఈఈ మల్లికార్జునరావు మాట్లాడారు. ఎడమ కాల్వ పరిధిలో తాగునీటి అవసరాలకు సుమారు 1.5 టీఎంసీలు, ఉదయ సముద్రం పరిధిలో తాగునీటి కోసం 1 టీఎంసీ నీటిని విడుదల చేశామని తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు శ్రీశైలం నుంచి 8,165 క్కూసెక్కుల వరదనీరు సాగర్ జలాశయానికి వస్తోంది. సాగర్ నుంచి కుడికాల్వ ద్వారా 5,700 క్యూసెక్కులు, ఎడమకాల్వ ద్వారా 1,665 క్యూసెక్కులు నీటిని వదులుతున్నారు.
గోదావరిలో కాళేశ్వరం ప్రధాన బ్యారేజీ మేడిగడ్డకు వరద ప్రవాహం పెరుగుతోంది. మేడిగడ్డ వద్ద 3.41 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా అంతే మొత్తాన్ని దిగువకు వదులుతున్నారు. దిగువన సమ్మక్క సాగర్ వద్ద 3.75 లక్షల క్యూసెక్కుల ప్రవాహం నమోదవుతోంది.
అంధకారంలో మత్స్యకారుల జీవితాలు - ఆశాలన్నీ కూటమి ప్రభుత్వపైనే! - Fishermen Faced Problem