ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తీరం దాటిన వాయుగుండం - ఆ జిల్లాలకు పొంచి ఉన్న ప్రమాదం

దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు - అల్పపీడనంగా బలహీనపడుతున్న వాయుగుండం

By ETV Bharat Andhra Pradesh Team

Published : 4 hours ago

Updated : 1 hours ago

Heavy_rains_in_AP
Heavy rains in AP (ETV Bharat)

Heavy rains in AP: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీరం దాటింది. తీరాన్ని సమీపించేలోగా తీవ్ర అల్పపీడనంగా బలహీనపడొచ్చనే అంచనాలున్నాయి. తిరుపతి జిల్లా తడ సమీపంలో తీరం దాటినట్లు వాతావరణశాఖ వెల్లడించింది. గడిచిన 6 గంటలుగా 22 కి.మీ. వేగంతో వాయుగుండం తీరాన్ని తాకింది.

ప్రస్తుతం అల్పపీడనంగా వాయుగుండం బలహీనపడుతోంది. దీని ప్రభావంతో ఇవాళ కూడా వర్షాలు పడుతాయని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. వాయుగుండం ప్రభావంతో ఉత్తర తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని అధికారులు పేర్కొన్నారు.

దక్షిణ కోస్తా, రాయలసీమలోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు, మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశముందన్నారు. నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, వైఎస్సార్ కడప, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భావిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు వచ్చే ప్రమాదముందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. కృష్ణపట్నం, వాడరేవు, నిజాంపట్నం, మచిలీపట్నం వరకు పోర్టులకు మూడో నంబరు, కాకినాడ, గంగవరం, విశాఖపట్నం, కళింగపట్నం పోర్టులకు ఒకటో నంబరు హెచ్చరికలు జారీ చేశారు.

బంగాళాఖాతంలో వాయుగుండం ఎఫెక్ట్ - తిరుపతిలో భారీ వర్షాలు - స్తంభించిన జనజీవనం

ప్రస్తుతం వాయుగుండం క్రమంగా బలహీనపడుతుంది. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ తెలిపారు. దక్షిణకోస్తా, రాయలసీమలో కొన్నిచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగిలినచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

మరోవైపు భారీ వర్షాల దృష్ట్యా నేడు తిరుమల శ్రీవారిమెట్టు నడక మార్గం మూసివేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా టీటీడీ ముందస్తు చర్యలు తీసుకుంది. వాతావరణశాఖ హెచ్చరికల దృష్ట్యా అప్రమత్తమైన టీటీడీ, కొండచరియలపై నిఘా ఉంచి ఘాట్‌రోడ్లలో ట్రాఫిక్‌జామ్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. భక్తుల దర్శనాలు, వసతికి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేసింది.

ముంచుకొచ్చిన వాయుగుండం - అతి భారీ వర్ష సూచన - వెనక్కి వచ్చిన 61,756 మంది మత్స్యకారులు

Last Updated : 1 hours ago

ABOUT THE AUTHOR

...view details