Heavy Rains in AP: బంగాళా ఖాతంలో అల్పపీడనం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఎడ తెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు నియోజకవర్గాల్లో పంటలు నీటమునిగాయి. శుక్రవారం రాత్రి నుంచి కురుస్తోన్న వానతో విజయవాడ నగరంలో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి.
కొండచరియలు విరిగిపడి నలుగురు మృతి: విజయవాడ మొగల్రాజపురంలో సున్నపుబట్టి సెంటర్ వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. కొండచరియలు విరిగిపడి పలు ఇళ్లు ధ్వంసం అయ్యాయి. కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఐదుగురు మృతి చెందగా మరొ ఇద్దరి ఆచూకీ తెలియాల్సి ఉంది. ఈ ఘటనలో మరో ఐదుగురికి తీవ్రగాయాలు కాగా, వారిని ఆస్పత్రికి తరలించారు. ముందుగా నలుగురు మృతి చెందగా తాజాగా రాళ్ల మధ్య సంతోష్ అనే యువకుడి మృతదేహం లభ్యమైంది. ఘటనా స్థలానికి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, కలెక్టర్ సృజన తదితరులు చేరుకొని సహాయక చర్యలు పర్యవేక్షించారు. కొండ చెరియలు విరిగిపడిన ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారు మేఘన, బి. లక్ష్మీ, అన్నపూర్ణ, లాలో పూర్కయత్గా అధికారులు గుర్తించారు. దెబ్బతిన్న ఇళ్లలో ఎంతమంది ఉన్నారోనని అధికారులు పరిశీలిస్తున్నారు.
సీఎం చంద్రబాబు విచారం:ఈ ఘటనలో నలుగురు చనిపోవడంపై సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు చొప్పున పరిహారం ప్రకటించారు. అంతే కాకుండా వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను సీఎం ఆదేశించారు.
వాహనదారులు తీవ్ర ఇబ్బందులు:రెండ్రోజులుగా కురుస్తున్న వర్షాలకు రామవరప్పాడు రింగ్‌రోడ్ వద్ద ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయి. రింగ్‌రోడ్ నుంచి నిడమానూరు వరకు వర్షపు నీటిలోనే కార్లు, బైకులు ఆగిపోవటంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు విజయవాడలోని వన్ టౌన్, గురునానక్ కాలనీ, చుట్టుగుంట, కృష్ణలంక, రామలింగేశ్వరనగర్‌లోని లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి.
బందర్ రోడ్డు, ఏలూరు రోడ్డు సహా బెంజిసర్కిల్ తదితర ప్రాంతాల్లో భారీగా నీరు నిలవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భారీ వర్షానికి విజయవాడ రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. విద్యాధరపురం, ఆర్‌ఆర్‌నగర్‌లో రహదారులు జలమయమయ్యాయి. రహదారులపై మోకాళ్ల లోతు నీటిలో వాహనాల రాకపోకలు సాగిస్తున్నాయి.