Rains in Alluri District: వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు భారీగా కురుస్తున్నాయి. వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఈ క్రమంలోనే అల్లూరి సీతారామరాజు జిల్లాలో వానలు దంచికొడుతున్నాయి. జిల్లాలో రాజవొమ్మంగి, మారేడుమిల్లి, అరకులోయ, జీకే వీధి, పాడేరు మండలంలో అధిక వర్షపాతం నమోదైనట్లు పేర్కొంది.
పలుచోట్ల స్తంభించిన రాకపోకలు :రంపచోడవరంలోని భూపతిపాలెం జలాశయం 2 గేట్లు ఎత్తి సీతపల్లి వాగులోకి నీరు విడుదల చేశారు. ఏజెన్సీ ప్రధాన కేంద్రమైన రంపచోడవరంలో వారపు సంత కావడంతో గిరిజనులు అవస్థలు పడుతున్నారు. గంగవరం వద్ద జాతీయ రహదారిపై వరద నీరు చేరి వాహనదారులకు ఇబ్బందికరంగా మారింది. కొండవాగులు పొంగి ఉద్ధృతంగా ప్రవహించడంతో పలుచోట్ల రాకపోకలు నిలిచిపోయాయి. జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐటీడీఏ పీఓ అభిషేక్ తెలిపారు. గడ్డలు, వాగులు దాటరాదని చెప్పారు. వాహనదారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు.
ఉత్తరాంధ్రకు రెడ్ అలర్ట్ - విశాఖలో విరిగిపడుతున్న కొండచరియలు - red alert for north andhra
ఆర్టీసీ బస్సు బోల్తా : అల్లూరి జిల్లా రాజవొమ్మంగి మండలం బోర్నగూడం వద్ద బస్సు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్క డొంకలో ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. బస్సులోని ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. రాజమహేంద్ర వరం నుంచి నర్సీపట్నం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు కల్వర్టులు కొట్టుకుపోతున్నాయి. గూడెం కొత్తవీధి మండలం దారకొండ పంచాయతీ వద్ద చామగడ్డ కల్వర్టు కొట్టుకుపోయింది. దీంతో అటువైపు వెళ్లే 20 -30 గ్రామాల ప్రజలకు రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాలకు వరి పంటలు పూర్తిగా మునిగిపోతున్నాయి.