తెలంగాణ

telangana

ETV Bharat / state

తక్కువ ఖర్చుతో అత్యాధునిక వైద్యం - విదేశీయులను ఆకర్షిస్తున్న హైదరాబాద్ హాస్పిటల్స్ - HEALTH TOURISM IN HYDERABAD

హైదరాబాద్‌ నగరంలో పెరుగుతున్న వైద్య పర్యాటకం - నిరుడు 2.40 లక్షల మంది మెడికల్‌ టూరిస్టుల రాక - వారి కోసం ఆసుపత్రుల్లో ప్రత్యేక విభాగాలు

Health Tourism Is Growing In Hyderabad City
Health Tourism Is Growing In Hyderabad City (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jan 20, 2025, 12:48 PM IST

Health Tourism Is Growing In Hyderabad City :సుడాన్‌కు చెందిన రౌయిడ క్యాన్సర్‌ చికిత్స కోసం నెల రోజుల క్రితం హైదరాబాద్‌ నగరానికి వచ్చారు. ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరిన ఆమె 5 నెలల పాటు నగరంలో ఉంటారు. టోలీచౌకి ప్రాంతంలో తమ దేశానికి చెందిన ఆహారం లభిస్తోందని, అన్ని సౌకర్యాలు బాగుండటంతో అక్కడే ఉంటున్నట్లు ఆమె తెలిపారు.

కెన్యా రాజధాని నైరోబీకి చెందిన జాన్‌ కెనడీ (37) నోటి క్యాన్సర్‌ చికిత్స కోసం గత సంవత్సరం నవంబరు 14న హైదరాబాద్‌లోని ఓ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిలో చేరారు. తమ దేశంలో రోబోటిక్‌ శస్త్ర చికిత్స లేకపోవడంతో ఇక్కడికి వచ్చానని ఆమె తెలిపారు. ఇతర దేశీయుల కోసం ప్రత్యేకంగా అపార్ట్‌మెంట్లు అద్దెకు ఉన్నాయని వారు ఆనందం వ్యక్తం చేశారు.

హీల్‌ ఇన్‌ ఇండియా :తెలంగాణలో వైద్య రంగం అత్యాధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటోంది. ముఖ్యంగా హైదరాబాద్‌ నగరంలో అనేక దేశాల్లో లేని కీలక శస్త్ర చికిత్సలతో పాటు రోబోటిక్‌ సర్జరీలు అందుబాటులోకి వచ్చాయి. అందుకే వైద్య పర్యాటకానికి భాగ్యనగరం కేంద్ర బిందువుగా మారుతోంది. ఇతర దేశాల నుంచి ప్రతి సంవత్సరం లక్షల మంది మెడికల్‌ టూరిస్టులుగా హైదరాబాద్‌కు వస్తున్నారు. ఈ క్రమంలో కార్పొరేట్‌ ఆసుపత్రులు విదేశీయుల కోసం ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తున్నాయి. వీరికి భారత ప్రభుత్వం సైతం 'హీల్‌ ఇన్‌ ఇండియా' పేరిట మెడికల్‌ వీసాలను ప్రత్యేకంగా అందిస్తోంది.

ఒక్కో టూరిస్టు ఖర్చు - రూ.8 లక్షల వరకు : కేంద్ర పర్యాటక శాఖ గణాంకాల ప్రకారం 2023 సంవత్సరంలో భారత్‌కు సుమారు 61 లక్షల మంది విదేశీయులు వైద్య చికిత్సల కోసం వచ్చారు. గత సంవత్సరం వారి సంఖ్య 73 లక్షలకు చేరింది. భారత పరిశ్రమల సమాఖ్య అధ్యయనం ప్రకారం హైదరాబాద్‌కు ప్రతి సంవత్సరం సుమారు 2 లక్షల మంది వైద్య పర్యాటకులు వస్తున్నారు. 2024లో వారి సంఖ్య 20 శాతం పెరిగి, సుమారు 2.2 లక్షలకు చేరినట్లు ఓ అంచనా. హైదరాబాద్‌కు వస్తున్న ఒక్కో మెడికల్‌ టూరిస్టు సగటున రూ.2.5 లక్షల నుంచి రూ.8 లక్షల వరకు ఖర్చు చేస్తున్నారు. దీని వల్ల స్థానికంగా హోటళ్లు, ట్రావెల్‌ రంగాలు అభివృద్ధి చెందుతున్నాయి. మెడికల్‌ టూరిజం కోసమే నగరంలో పదుల సంఖ్యలో ట్రావెల్‌ ఏజెన్సీలు ఏర్పడ్డాయి.

వెయ్యి ఎకరాల్లో వైద్య పర్యాటక హబ్‌కు హామీ :హైదరాబాద్‌కు గుండె, కంటి, ఎముకలు ,న్యూరో సర్జరీల కోసం, కాలేయ, మూత్రపిండాలు మార్పిడికి అధికంగా వస్తున్నారు. ఐవీఎఫ్‌, క్యాన్సర్‌ చికిత్స కోసమూ తరలివస్తున్నారు. చిన్న పిల్లలకు గుండె శస్త్ర చికిత్సలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వైద్య పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు వెయ్యి ఎకరాల్లో వైద్య పర్యాటక హబ్‌ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. దీనిపై త్వరలో మార్గదర్శకాలను తీసుకు వస్తామని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ వెల్లడించారు.

ప్రముఖ కార్పొరేట్‌ హాస్పిటల్స్ వైద్య పర్యాటకులకు సౌకర్యాలు కల్పించేందుకు పోటీ పడుతున్నాయి. ఇంటర్నేషనల్‌ పేషెంట్‌ విభాగాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో హాస్పిటల్​కి కనీసం ప్రతి సంవత్సరం 500 నుంచి 5,000 వరకు విదేశీ రోగులు వస్తున్నట్లు హాస్పిటల్స్​ యాజమాన్యాలు అంటున్నాయి. పిల్లల హాస్పిటల్స్​ల్లోనూ విదేశీ రోగుల విభాగాలు ఏర్పాటు చేస్తున్నారు. నిమ్స్‌కు ఇటీవల 4 దేశాల రోగులు వచ్చినట్లు మూత్రపిండాల వైద్య నిపుణుడు డా. శ్రీభూషణ్‌ రాజు తెలిపారు.

విమాన సర్వీసులు పెంచితే మేలు :వైద్య పర్యాటకులకు సౌకర్యాలను కల్పిస్తున్నామని, ఎయిర్​పోర్ట్​లోనూ వైద్య కేంద్రం అందుబాటులో ఉంటోందని, ట్రాన్స్‌లేటర్లను నియమిస్తున్నామని అపోలో ఆసుపత్రికి చెందిన ఇంటర్నేషనల్‌ బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ ఉపాధ్యక్షుడు రాధే మోహన్‌ తెలిపారు. ఆఫ్రికా దేశాల నుంచి హైదరాబాద్‌ నగరానికి నేరుగా విమానాల సేవలను పెంచితే ఈ రంగంలో మూడింతల వృద్ధి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.

అనేక రకాల అంశాలు దోహదం :హైదరాబాద్‌ నగరం మెడికల్‌ టూరిజానికి మరో పేరుగా మారుతోందని సికింద్రాబాద్‌ కిమ్స్‌ ఆసుపత్రి మెడికల్‌ డైరెక్టర్ డాక్టర్‌ సంబిత్‌ సాహు అన్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన చికిత్సలు తక్కువ ధరలకు అందుబాటులో ఉండటం, నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ, వేచి చూసే టైం తక్కువలాంటి అంశాలు ఇందుకు దోహదపడుతున్నాయని తెలిపారు. ఇక్కడ ఇతర దేశీయులకూ అద్దె గదులు సులభంగా దొరకడం, జీవనవ్యయం తక్కువగా ఉండటం కలిసి వస్తోందని వెల్లడించారు.

"తెలంగాణను మెడికల్ టూరిజం హబ్​గా తీర్చిదిద్దుతాం"

ABOUT THE AUTHOR

...view details