Hazardous Gases Released in Kendriya Vidyalaya Science Lab :బాపట్ల జిల్లా సూర్యలంక వాయుసేనా కేంద్రం ఆవరణలోని కేంద్రీయ విద్యాలయలో 25 విద్యార్థులు అస్వస్థతకు గురికావడం తీవ్ర కలకలం రేపింది. పాఠశాలలో సైన్స్ ఉపాధ్యాయురాలు సుజాత క్లోరోఫిల్ ఆమ్లం, నిమ్మ ఉప్పుతో ఓ ప్రయోగాన్ని విద్యార్థుల ఎదుట ప్రదర్శించారు. ఆమె బయటకు వెళ్లగానే నవ్య శ్రీ అనే విద్యార్థిని కాఫీపొడితో పాటు ఉప్పు, శానిటైజర్, పంచదారను ఉపాధ్యాయురాలు తయారు చేసిన మిశ్రమానికి కలిపారు. దీంతో వాయువులు ఆరో తరగతి గదితో పాటు ఎదురుగా ఉన్న ఏడో తరగతి గదిలోకి వ్యాపించాయి.
అది పీల్చిన 25 మంది విద్యార్థులు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. కొందరు స్పృహ తప్పారు. వెంటనే అప్రమత్తమైన ఉపాధ్యాయులు వాయుసేనా కేంద్ర ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స చేయించారు. తర్వాత మెరుగైన వైద్యం కోసం బాపట్ల జిల్లా ఆస్పత్రికి తరలించారు. విద్యార్థులకు చికిత్స అందిచడంతో 23 మంది కోలుకున్నారు. ఒక విద్యార్థి షణ్ముఖకు గుండె సమస్య ఉన్నట్లు ఈసీజీలో వైద్యులు గుర్తించారు. మెరుగైన వైద్యం కోసం షణ్ముఖను గుంటూరులోని ఆస్పత్రికి అధికారులు తరలించారు. మరో విద్యార్థిని మాధురికి జ్వరం రావడంతో వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు.