Family Survey in Telangana :తెలంగాణ వ్యాప్తంగా బుధవారం నుంచి ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలు ఒంటిపూట పని చేయనున్నాయి. అసలు ఈ టైమ్లో ఒంటిపూట బడులు ఏంటా అని ఆలోచిస్తున్నారా? ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం కుల గణనకు ఉపాధ్యాయులను వినియోగించాలన్న సర్కారు నిర్ణయం మేరకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మాత్రమే ప్రాథమిక పాఠశాలలు నిర్వహించాలని పాఠశాల విద్యా శాఖ నిర్ణయించింది.
ఈ మేరకు ఇప్పటికే ఉత్తర్వులు సైతం జారీ చేసింది. కులగణనకు మొత్తం పాఠశాల విద్యా శాఖ నుంచి 50 వేల మంది వరకు సిబ్బందిని వినియోగించనున్నారు. ఇందులో 36 వేల 559 మంది ఎస్జీటీ, 3 వేల 414 మంది ప్రైమరీ పాఠశాలల ప్రిన్సిపాళ్లు, 6 వేల 256 మంది ఎంఆర్సీలు, 2 వేల మంది ప్రభుత్వ మినిస్టీరల్ స్టాఫ్ సహా వివిధ విభాగాలకు చెందిన వారు ఉన్నారు. అయితే ఉపాధ్యాయుల కొరత, ఉన్నత పాఠశాలల విద్యార్థులకు బోధనా పరంగా ఇబ్బందులు ఉండకూడదనే ఉద్దేశంతో ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో పని చేస్తున్న ఎస్జీటీలకు కులగణన నుంచి మినహాయింపు ఇచ్చారు. దీంతో సర్వే పూర్తయ్యే వరకూ ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలు ఒంటిపూట నిర్వహించాలని నిర్ణయించారు.
75 రకాల ప్రశ్నలతో సర్వే: తెలంగాణలో సమగ్ర కుటుంబ సర్వేను 6వ తేదీ నుంచి ప్రారంభించేందుకు ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. సర్వేలో భాగంగా ప్రతి ఇంటికీ మొత్తం 75 రకాల ప్రశ్నలతో వివరాలు అడుగుతారు. ఈ క్రమంలో సర్వే చేసే ఎన్యుమరేటర్లు ఇంటికి వచ్చి ఏం ప్రశ్నలు అడుగుతారు.? ఏం సమాధానం చెప్పాలనే చాలా మంది ప్రజలు ఆలోచిస్తున్నారు. మీ సందేహాలను నివృత్తి చేసేందుకు ఈ కింద ఇచ్చే సమాచారం ఒకసారి చదవితే కుటుంబ సర్వేలే ఏం అడుగుతారో తెలుస్తుంది.
మీకున్న ఆస్తులు ఎన్ని ఉన్నాయో చెప్పాలి. అలాగే అప్పులు ఉంటే అవి కూడా చెప్పాలి. సంవత్సరానికి వచ్చే ఆదాయమెంత, ఇంట్లో ఎంతమంది ఉంటారనే విషయాలు అడుగుతారు. ఎవరైనా విదేశాలకు, ఇతర రాష్ట్రాలకు వెళ్లారా, ప్రజా ప్రతినిధిగా ఎన్నికయ్యారా అనే వివరాలను సైతం తీసుకుంటారు. ఈ మేరకు సర్వేలో కుటుంబ యజమాని, సభ్యుల వివరాలను నమోదు చేయడంతో పాటు కుటుంబంలోని ప్రతి ఒక్కరి ఫోన్ నంబర్, వారు చేసే వృత్తి, ఉద్యోగ వివరాలను తీసుకుంటారు.
విదేశాలకు వెళ్తే స్పెషల్ కోడ్ :కుటుంబంలో ఎవరైనా విదేశాలకు వెళ్లారా లేదా, ఇతర రాష్ట్రాలకు వెళ్తే ఏ కారణంతో వెళ్లారనేది చెప్పాల్సి ఉంటుంది. ఉన్నత చదువుల కోసం, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి లేదా ఎందుకు వెళ్లారనే వివరాలను కుటుంబ యజమానిని అడుగుతారు. విదేశాల్లో యూకే, అమెరికా, గల్ఫ్, ఆస్ట్రేలియా, కెనడాలతో పాటు ఐరోపా దేశాలకు వెళ్లినట్లు చెబితే ఒక్కో దేశానికి ఒక ప్రత్యేక కోడ్ను నమోదు చేస్తారు. ఏ దేశానికి వెళ్లినా ఇతర దేశం అనే కోడ్ నమోదు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ నుంచి ఎంత మంది వలస వెళ్లారు. ఏ కారణాలతో బయటకు వెళ్లారనే సమగ్ర సమాచారం కోసం ఈ ప్రశ్నలు రూపొందించినట్లు తెలిపారు.
అప్పులు, ఆస్తులపై :ప్రజలు తీసుకున్న రుణాలపై ప్రత్యేకంగా మూడు ప్రశ్నలు అడుగుతారు. గత ఐదేళ్లలో ఏమైనా అప్పులు తీసుకున్నారా? అని అడుగుతారు. తీసుకుంటే ఎందుకు తీసుకున్నారని, ఎక్కడి నుంచి రుణం పొందారనే ప్రశ్నలను ప్రతి కుటుంబాన్ని అడగాలని నిర్ణయించారు. బ్యాంకులు, స్వయం సహాయక సంఘాల నుంచే కాకుండా వడ్డీ వ్యాపారుల నుంచి తీసుకున్నారా? అనే వివరాలను కూడా చెప్పాల్సి వస్తుంది.
స్థిర, చరాస్తుల వివరాలు :కుటుంబ సభ్యులందరి స్థిర, చరాస్తుల వివరాలన్నీ చెప్పాలి. చరాస్తుల వివరాలను వేర్వేరుగా నమోదు చేస్తారు. వీటిలో బైకు, స్కూటర్, సొంత అవసరాలకు వాడే కారు, కిరాయికి తిప్పుతున్న కారు వంటివి ఉన్నాయా? ఫ్రిజ్లు, టీవీలు, స్మార్ట్‌ఫోన్, ఏసీలు, వాషింగ్ మిషన్ ఇలా మొత్తం 18 రకాల చరాస్తుల వివరాలన్నీ చెప్పాల్సి ఉంటుంది. ఒక కుటుంబంలోని సభ్యులందరికీ కలిపి ఇవన్నీ ఎన్ని ఉన్నాయి? వాటి విలువ ఎంత అనేది సైతం తెలపాల్సి ఉంటుంది.