Guntur Channel Contamination Due to Drainage : 47 కిలోమీటర్ల పొడవున ఉండే గుంటూరు ఛానల్ కాలువ వల్ల 27వేల ఎకరాలకు సాగునీరందుతోంది. 36 గ్రామాల రైతులు పంటలు సాగు చేసుకుంటున్నారు. 12 గ్రామాలకు ఈ కాలువ నుంచి తాగునీరు సరఫరా చేస్తుంటారు. ఇంతటి కీలకమైన కాలువ కొన్నేళ్లుగా కాలుష్యం బారిన పడింది. గుంటూరు నగరంతోపాటు ఉండవల్లి, తాడేపల్లి, మంగళగిరి, పెదకాకానిలోని వివిధ ప్రాంతాల నుంచి మురుగునీరు గుంటూరు ఛానల్లో కలుస్తోంది.
మురుగు నీరు డ్రెయిన్లలోకి వెళ్లేందుకు దశాబ్దాల క్రితమే చప్టాలు నిర్మించారు. అయితే చప్టాలు శిథిలం కావటంతో అక్కడి నుంచి మురుగునీరు గుంటూరు ఛానల్లో కలుస్తోంది. మురుగునీరు కలవటం ద్వారా ప్రమాదకర పదార్థాలతో కాలువనీరు విషతుల్యం అవుతోంది. అనంతవరప్పాడు, లేమల్లెపాడు, గారపాడు, తక్కెళ్లపాడు గ్రామాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది.
ఆయా గ్రామాలకు నీటిని సరఫరా చేసే క్రమంలో ఫిల్టర్ పాయింట్ల ద్వారా శుద్ధి చేసినా రసాయన అవశేషాలు మాత్రం నీటి నుంచి వేరుకావు. దీంతో ఆ నీరు తాగాలంటే ప్రజలు భయపడే పరిస్థితి నెలకొంది. ఇప్పటికే కొందరు చర్మ వ్యాధుల బారిన పడ్డారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం గత ఐదేళ్లలో కాలువల మరమ్మతులు చేయలేదని కనీసం కాలువల్లో గుర్రపుడెక్క కూడా తొలగించలేదని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.