Employees demand to cancel CPS:విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద సీపీఎస్ రద్దు కోరుతూ ఏపీ సీపీఎస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సాగర సంగ్రామం పేరిట రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులు ఉద్యోగులు, సంఘాల నేతలు ఈదీక్ష చేపట్టారు.సీపీఎస్ రద్దు, పాత పెన్షన్ విధానం అమలుచేయాలని డిమాండ్ తో నినాదాలు చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ తీరు ఎండ గడుతూ ఫ్లెక్స్ లను దీక్ష వద్ద ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో ఉపాధ్యయా సంఘాలు, ఉద్యోగ సంఘాలు ఈ దీక్షలో పాల్గొన్నారు. సీపీఎస్ రద్దు చేసి ఓపిఎస్ ఇచ్చే వరకు ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు.
సీపీఎస్ రద్దు కోసం ఉద్యోగులు మరోసారి గళమెత్తారు. వారం రోజుల్లో సీపీఎస్ రద్దు చేస్తామంటూ మాటతప్పిన వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు తాము సిద్ధమని ప్రకటించారు. విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఏపీ సీపీఎస్ ఉద్యోగులు సాగర సంగ్రామ దీక్ష చేపట్టారు. నిరసనకు ఉద్యోగులు హాజరుకాకుండా శనివారం రాత్రి నుంచే ఎక్కడికక్కడ గృహనిర్బంధాలు, అడ్డగింపులు చేశారు. శాంతియుత ధర్నాకు అనుమతి తీసుకున్నా అడ్డుకోవడం ఏంటని ఉద్యోగ సంఘాల నేతలు మండిపడ్డారు.
'జీపీఎస్ గురించి అయితే చర్చలకు పిలవొద్దు.. తేల్చిచెప్పిన ఉద్యోగ సంఘాలు'
సీఎం జగన్ మోసపూరిత హామీలతో దగా చేశారని ఆరోపిస్తూ సీపీఎస్ ఉద్యోగులు ఆందోళన నిర్వహించారు. విశాఖలో సాగర సంగ్రామ దీక్ష చేపట్టి తమ ఆకాంక్షను బలంగా చాటే ప్రయత్నం చేశారు. దీక్షలో పాల్గొన్న ఉద్యోగులు చెవిలో క్యాలీఫ్లవర్లు పెట్టుకుని నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీపీఎస్, జీపీఎస్ విధానాలను వెనక్కి తీసుకుని ఓపీఎస్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే వచ్చే ఎన్నికల్లో జగన్ కు ఓటుతో తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.