Pension Distribution Issue in AP : రాష్ట్రంలో సామాజిక పింఛన్ల పంపిణీకి ప్రభుత్వం సరైన ఏర్పాట్లు చేయకపోవడంలో లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అలాగే పింఛన్ దారులకు అధికారులు సరైన అవగాహన కల్పించకపోవడంతో అవ్వా, తాతలు, దివ్యాంగులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నడవలేని స్థితిలో ఉన్నవారికి ఇంటివద్దకే వెళ్లి పింఛన్ సొమ్మును అందజేయాలన్న ఆదేశాలు ఎక్కడా అమలు చేయలేదు. ఫలితంగా వారంతా సచివాలయాల వద్దకు వచ్చి అవస్థలు పడ్డారు.
చివరికి అనుకున్నదే సాధించారు - అవ్వాతాతలను ఎండలో నిలబెట్టారు!
ఉదయం 9 గంటల నుంచే పింఛన్లు పంపిణీ చేయాల్సి ఉన్నా బ్యాంకు నుంచి ఇంకా సొమ్ము తమ చేతికి రాలేదని మధ్యాహ్నం రావాల్సిందిగా చాలామందిని సచివాలయ సిబ్బంది వెనక్కి పంపారు. మరికొన్నిచోట్ల గంటల తరబడి వేచిచూసేలా చేశారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ, కంచికచర్ల సచివాలయాల వద్ద కనీసం ఎండ నుంచి రక్షణకు టెంట్లు కూడా ఏర్పాటు చేయలేదు.
బ్యాంకు నుంచి డబ్బులు జమ కాలేదు :కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గంలోని గ్రామ సచివాలయాల వద్ద కనీసం సమాచారం ఇచ్చేవారు కరవయ్యారు. వృద్ధుల కోసం కనీసం తాగునీరు ఏర్పాటు చేయలేదు. దివ్యాంగులు, నడవలేని స్థితిలో ఉన్న వృద్ధులకు ఇళ్ల వద్దే పింఛన్ పంపిణీ చేయాల్సి ఉండగా వారికి సమాచారం ఇవ్వకపోవడంతో వారంతా సచివాలయాలకు చేరుకుని పడిగాపులు కాశారు. మొవ్వ సచివాలయంలో పై అంతస్తులో పింఛన్లు ఇవ్వడంతో వృద్ధులు మెట్లు ఎక్కి పైకిరాలేక ఇబ్బందిపడ్డారు. పింఛన్ల పంపిణీకి కింద ఏర్పాట్లు చేయాలన్న కనీస అవగాహన అధికారులకు లేదు. గుంటూరు జిల్లాలో మధ్యాహ్నం వరకు బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం సొమ్ముల జమ చేయలేదు. ఆర్థిక సంవత్సరం ముగింపు సందర్భంగా బ్యాంకుల్లోనూ నగదు అందుబాటులో లేకపోవడంతో కొంత ఇబ్బందులు ఎదురయ్యాయి.