Government Changed YSRCP Government Schemes Names: గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో విద్యార్థులకు అందిస్తున్న పథకాల పేర్లను కూటమి ప్రభుత్వం తొలగించింది. వాటి స్థానంలో విద్యారంగంలో సేవలందించిన వారి పేర్లను ఆయా పథకాలకు నామకరణం చేసింది. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా వాటి పేర్లను పెట్టినట్లు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. జగనన్న అమ్మ ఒడిని తల్లికి వందనంగా, జగనన్న విద్యాకానుకను సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్రగా, జగనన్న గోరుముద్దను డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనంగా పేరు మార్చారు.
మన బడి నాడు-నేడు పథకాన్ని మన బడి-మన భవిష్యత్తునగా నిర్ణయించారు. స్వేచ్ఛను బాలిక రక్షగా, జగనన్న ఆణిముత్యాలు పథకానికి అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారంగా మార్చినట్లు మంత్రి లోకేశ్ తెలిపారు. ఈ సందర్భంగా మార్చిన పథకాల పేర్లను సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఐదేళ్లపాటు గత ప్రభుత్వం భ్రష్టుపట్టించిన విద్యావ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేయాలని చంద్రబాబు నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి లోకేశ్ తెలిపారు. విద్యాలయాలను రాజకీయాలకు అతీతంగా సరస్వతీ నిలయాలుగా తీర్చిదిద్దాలన్నది తమ సంకల్పమన్నారు. ఇందులో భాగంగా నాటి ముఖ్యమంత్రి జగన్ పేరుతో పేరుతో ఏర్పాటు చేసిన పథకాల పేర్లకు స్వస్తి పలుకుతున్నట్లు మంత్రి లోకేశ్ తెలిపారు.