ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మీ గోల్డ్ ఎంత నాణ్యత? - బంగారంలో మోసాలకు పాల్పడుతున్న వ్యాపారులు - GOLD SMUGGLING IS RAMPANT

22 క్యారెట్ల బంగారు ఆభరణమంటారు కానీ 18 క్యారెట్ల ఆభరణాన్ని కట్టబెడుతారు

gold_shops_traders_cheating_in_andhra_pradesh
gold_shops_traders_cheating_in_andhra_pradesh (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : 11 hours ago

Gold Shops Traders Cheating in Andhra Pradesh :కర్నూలుకు చెందిన మహిళ ఓ బంగారం దుకాణంలో రెండు తులాల గొలుసు కొనుగోలు చేశారు. ఇంటి అవసరాల నిమిత్తం ఆమె భర్త బ్యాంకులో తనఖా పెట్టేందుకు వెళ్లారు. బ్యాంకు అధికారులు హాల్‌మార్క్‌ సెంటర్‌కు ఆభరణాన్ని పంపగా అందులో బంగారం 70 శాతం ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. 17 శాతం రాగి, 13 శాతం వెండి ఉన్నట్లు తేలడంతో వారు ఆశించినంతమేర రుణం ఇచ్చేందుకు బ్యాంకు నిరాకరించింది. రసీదు లేకపోవటంతో సదరు బంగారు వ్యాపారిపై బాధితులు ఫిర్యాదు చేయలేకపోయారు.

బంగారు ఆభరణాల కొనుగోలులో ఎందరో మహిళలు, అమాయకులు మోసపోతున్నారు. పెద్దఎత్తున సొమ్ము కోల్పోతున్నారు. అయినా తూనికలు, కొలతల శాఖ అధికారులుగానీ వాణిజ్య పన్నుల శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. ఇదే అదనుగా కొందరు వ్యాపారులు వినియోగదారులను నిలువునా మోసగిస్తున్నారు. బంగారం ధర రోజురోజుకు పెరిగిపోతుండటంతో అంతేరీతిలో మోసాలు ఎక్కువయ్యాయి. ప్రధానంగా గ్రామీణ ప్రాంతవాసులు నిత్యం వంచనకు గురవుతున్నారు. ఇటు వినియోగదారులనేకాక అటు జీరో వ్యాపారంతో పన్ను ఎగ్గొడుతూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు.

నిత్యం రూ.100 కోట్లకుపైగా వ్యాపారం : ఉమ్మడి కర్నూలు జిల్లాలో కర్నూలు, నంద్యాల, ఆదోని ప్రాంతాల్లో 800కుపైగా చిన్న, పెద్ద బంగారు దుకాణాలు, షోరూంలు ఉన్నాయి. ఒక్క కర్నూలు నగరంలోనే ప్రముఖ సంస్థల దుకాణాలతో సహా దాదాపు 400 వరకు ఉన్నాయి. సగటున రోజూ దాదాపు రూ.100 కోట్ల వ్యాపారం జరుగుతుందని వ్యాపార వర్గాల అంచనా. బంగారు ఆభరణాల విషయంలో షోరూంల నిర్వాహకులు కొంత నిబంధనలు పాటిస్తుండగా మధ్యతరహా దుకాణాల నిర్వాహకులు కొందరు నిబంధనలు పాటించడం లేదు. బంగారం నాణ్యత పరిశీలించే క్యారెక్టరైజేషన్‌ యంత్రం వాడటం లేదు.

బంగారు ఆభరణం తయారు చేసేందుకు కొంత రాగి కలుపుతారు. అయితే నాణ్యత తెలిపే హాల్‌మార్క్‌ విషయంలో వినియోగదారులను మోసగిస్తున్నారు. 22 క్యారెట్ల బంగారు ఆభరణమంటూ 18 క్యారెట్ల ఆభరణాన్ని కట్టబెడుతున్నారు. అవగాహన లేని జనం పెద్దఎత్తున మోసపోతున్నారు. తూకాల్లోనూ అక్రమాలకు పాల్పడుతున్నారు. తెలివిగా రసీదులు ఇవ్వకుండా మామూలు కాగితాలపై రాసిస్తున్నారు. ఇటీవల తూనికలు, కొలతల శాఖ అధికారులు కర్నూలులో పలు బంగారు దుకాణాలను తనిఖీ చేసి 10 కేసులు నమోదు చేశారు.

డమ్మీ తుపాకీతో బెదిరించి బంగారం దోపిడీ - ఛేజింగ్ చేసిన పోలీసులు

హాల్‌మార్క్‌ తప్పనిసరి :బంగారు ఆభరణాలకు సంబంధించి హాల్‌మార్క్‌ ద్వారా స్వచ్ఛత, నాణ్యత తెలుస్తుంది. భారతీయ ప్రమాణాల మండలి (బీఐఎస్‌) నిబంధనల మేరకు వ్యాపారులు హాల్‌మార్క్‌తోనే విక్రయించాల్సి ఉంటుంది. 24 క్యారెట్ల బంగారంపై 999, 23 క్యారెట్లపై 958, 22 క్యారెట్లు-916, 21 క్యారెట్లు-875, 18 క్యారెట్లైతే 750 అనే ముద్ర ఉంటుంది. ఈ నంబరు తర్వాత హాల్‌మార్క్‌ వేసిన కేంద్రం గుర్తు, తయారైన సంవత్సరం, ఆంగ్ల అక్షరం కోడ్‌ ఉంటుంది. బీఐఎస్‌ ధ్రువీకరించిన ఆభరణాల తయారీదారుల గుర్తు ఉంటుంది. హాల్‌మార్క్‌ లేనట్లయితే మోసాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారంలో ఇతర లోహాలేమీ ఉండవు 22 క్యారెట్ల బంగారు ఆభరణంలో రెండు వంతుల శాతం రాగి, జింక్‌ ఉంటుంది.

18 క్యారెట్లైతే ఆరు భాగాలు ఇతర లోహాలు ఉంటాయి. బంగారం శాతాన్ని టంచ్‌ మిషన్ల ద్వారా నిర్ధారిస్తారు. బీఐఎస్‌ అనుమతి పొందిన అనుమతిదారుడి వద్దే బంగారం శాతాన్ని నిర్ధారణ చేసుకోవాలి. కానీ ఎలాంటి అనుమతులు లేని టంచ్‌మిషన్‌ కలిగిన వారి వద్ద నిర్ధారణ చేస్తున్నారు. అధికారిక పత్రంపైకాక సాధారణ కాగితంపై రాసి ఇస్తున్నారు. హాల్‌మార్క్‌ గుర్తును చూసిన తర్వాతే ఆభరణం కొనుగోలు చేయాలని అధికారులు సూచిస్తున్నారు.

వివిధ మార్గాల్లో తరలిస్తూ :ఉమ్మడి కర్నూలు జిల్లాలో బంగారం అక్రమ రవాణా పెద్దఎత్తున జరుగుతోంది. పసిడిని దిగుమతి చేసుకునే వ్యాపారులు 3 శాతం జీఎస్‌టీ, 12 శాతం ఎక్సైజ్‌ డ్యూటీ చెల్లించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో కొందరు వ్యాపారులు ఆయా పన్నులను ఎగవేస్తూ వ్యాపారం సాగిస్తున్నారు. కర్నూలు, నంద్యాల, రెండో ముంబయిగా పేరున్న ఆదోని ప్రాంతాలకు కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల నుంచి బంగారం అక్రమ రవాణా జరుగుతోంది. తమిళనాడు నుంచి హైదరాబాద్‌కు కర్నూలు మీదుగా అధికంగా బంగారం అక్రమ రవాణా సాగుతోంది. వ్యాపారులు తమకు నమ్మకమైన గుమస్తాల చేత ఆర్టీసీ బస్సులు, రైళ్లు, ప్రైవేటు వాహనాల్లో తరలిస్తుంటారు. తమిళనాడులో తయారయ్యే బంగారు ఆభరణాలను చాలామంది వ్యాపారులు జీరో దందాపైనే ఉమ్మడి జిల్లాకు రవాణా చేస్తుండటం గమనార్హం.

ఎన్నికల సమయంలోనే హడావుడి :ఎన్నికల సమయంలో మాత్రమే చెక్‌పోస్టుల్లో తనిఖీలు చేయటం ఆ తర్వాత పట్టించుకోకపోవడంతో బంగారం అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. ఈ ఏడాది మేలో ఎన్నికల సమయంలో 785 గ్రాముల బంగారాన్ని అధికారులు పట్టుకున్నారు. ఇదే ఏడాది ఫిబ్రవరిలో హైదరాబాద్‌ నుంచి కొయంబత్తూరుకు వెళ్లే బస్సును కృష్ణగిరి మండలం అమకతాడు వద్ద తనిఖీ చేయగా 4.2 కిలోల బంగారు ఆభరణాలు, 5 కిలోల వెండి బయటపడింది. గతంలో రూ.కోట్ల విలువ చేసే వజ్రాభరణాలు పట్టుబడిన సందర్భాలున్నాయి. ప్రస్తుతం సంబంధిత అధికారుల నిర్లక్ష్యంగా కారణంగా ప్రభుత్వానికి నిత్యం రూ.కోట్ల మేర ఆదాయానికి గండి పడుతోంది.

గచ్చిబౌలిలో నిత్య పెళ్లికొడుకు - విగ్ పెట్టుకుని వేషాలు మారుస్తూ..!

ABOUT THE AUTHOR

...view details