ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

లంకలను ముంచెత్తిన వరద గోదారి - బిక్కుబిక్కుమంటున్న కోనసీమ వాసులు - Godavari Floods in Lanka Villages - GODAVARI FLOODS IN LANKA VILLAGES

Godavari Floods in Lanka Villages: గోదావరి వరద ఉద్ధృతితో కోనసీమలోని లంక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. పడవలపైనే లంకవాసులు రాకపోకలు సాగించాల్సి వస్తోంది. కాజ్‌వేలు, ఉద్యానవన పంటలు నీట మునగటంతో రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Godavari_Floods_in_Lanka_Villages
Godavari_Floods_in_Lanka_Villages (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 24, 2024, 10:19 AM IST

Godavari Floods in Lanka Villages:గోదావరి వరద ఉద్ధృతితో కోనసీమలోని గౌతమి, వశిష్ఠ, వైనతేయ, వృద్ధ గౌతమీ నదీ పాయలు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. ఉగ్ర గోదావరి భీకర వరదలతో లంకలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. భద్రాచలం వద్ద కాస్త నెమ్మదించినా తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాల్లో వరద తీవ్రతతో జనం అవస్థలు పడుతున్నారు. 885 హెక్టార్లలో ఉద్యానవన పంటలు నీట మునిగాయి.

ధవళేశ్వరం కాటన్ ఆనకట్ట వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగడంతో భారీ వరదను సముద్రంలోకి వదులుతున్నారు. ఆనకట్ట వద్ద 14.8 అడుగుల నీటిమట్టం ఉంది. సముద్రంలోకి 14లక్షల 36వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.కొత్తపేట, పి. గన్నవరం, రాజోలు, ముమ్మిడివరం నియోజకవర్గాల్లో లంక గ్రామాలు వరద గుప్పిట్లో చిక్కుకున్నాయి . తీరమంతా ఉద్యానవన పంటలు ముంపు బారిన పడ్డాయి. అయినవిల్లి మండలం ఎదురుబీడెం కాజ్‌ వే పై వరద నీరు పొంగిపొర్లుతోంది. పడవలపైనే లంక వాసులు రాకపోకలు సాగిస్తున్నారు.

పి. గన్నవరం మండలం బూరుగులంక, అరుగులవారి పేట, జి.పెదపూడి లంక, ఏనుగుపల్లి లంకల్ని వరద ముంచెత్తింది. మామిడికూదురు మండలం అప్పనపల్లి కాజ్‌వేపై వరద నీరు చేరింది. ముమ్మిడివరం మండలం లంక ఆఫ్ ఠాణేలంక, గురజాపులంక, కూనాలంక ముంపు బారినపడ్డాయి. ఉద్యానవన పంటలన్నీ నీట మునిగాయి. అరటి, బొప్పాయి, కూరగాయలు పంటలు నీటమునిగాయి. పొలాలను వరదనీరు ముంచెత్తడంతో రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు.

ఓ వైపు వరదలు మరోవైపు గర్భిణీకి పురిటి నొప్పులు-నేనున్నానంటూ ప్రసవం చేసిన ఎమ్మెల్యే - MLA Tellam Do Delivery to Women

కె. గంగవరం మండలం సుందరపల్లి వద్ద గౌతమి గోదావరి ఎడమ గట్టు అత్యంత బలహీనంగా మారడంతో ఇసుక బస్తాలతో పటిష్టం చేశారు. కూళ్ల వద్దా ఇదే పరిస్థితి నెలకొనడంతో గట్టును పటిష్టం చేశారు. కాట్రేనికోన మండలం కుండలేశ్వరం వద్ద వృద్ద గౌతమీ గోదావరి గట్టు జారిపోవడంతో ఇసుక బస్తాలు అడ్డువేశారు. కోటిలంక వద్ద వరదలో చిక్కుకున్న 200 గొర్రెల్ని పడవలో ఒడ్డుకుచేర్చారు. కోనసీమ జిల్లా వ్యాప్తంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో సిబ్బంది పూర్తిగా 24 గంటలు అందుబాటులో ఉండాలని కలెక్టర్ మహేశ్​ కుమార్ ఆదేశించారు. క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ సిబ్బందికి ఆయన సూచనలిస్తున్నారు.

తూర్పుగోదావరి జిల్లా పెరవలి, ఉండ్రాజవరం మండలాల్లో వరద ముంపునకు గురైన పంట పొలాలను జిల్లా కలెక్టర్ ప్రశాంతి పరిశీలించారు. పెరవలి మండలం కానూరులో సుమారు 2వేల 500ఎకరాల వరి పంట నీటి మునిగినట్లు అధికారులు తెలిపారు. ఉండ్రాజవరం మండలం కాల్దరి, పసలపూడి, సూర్యారావుపాలెం గ్రామాల్లో సుమారు 5వేల ఎకరాల పంట ముంపునకు గురైంది. ముంపు గ్రామాల రైతులతో కలెక్టర్ మాట్లాడి సమస్య పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. భవిష్యత్తులో ముంపు నివారణా చర్యలు కోసం దీర్ఘకాలిక ప్రతిపాదనలు సిద్ధం చేయాలని నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు.

ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టు వద్ద అంతకంతకూ గోదావరి ప్రవాహం పెరుగుతుంది. ప్రాజెక్ట్ స్పిల్ వే వద్ద 33.645 మీటర్ల మేర నీటిమట్టం ఉండగా, 12,26,974 క్యూసెక్కులు వరద నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. నదీ ప్రవాహం తీవ్ర రూపం దాల్చడంతో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు. అదేవిధంగా కడెమ్మ స్లూయిజ్ వద్ద వరద నీరు ప్రాజెక్టు వెళ్లే మార్గంలోని వంతెన పై నుంచి ప్రవహించింది. దీంతో ప్రాజెక్ట్ నిర్మాణ ప్రాంతానికి ఉద్యోగులు వెళ్లేందుకు నానావస్థలు పడ్డారు.

అల్లూరి జిల్లాలో భారీ వర్షాలు - కొట్టుకుపోతున్న రహదారులు, వంతెనలు - Rains in Alluri District

ABOUT THE AUTHOR

...view details