Gayathri of Mangalagiri Talented Girl in 3D Art Drawing Famous Cine Artists Pictures :అభిరుచికి అనుగుణంగా అడుగులు వేసేందుకు, అనుకున్న రంగంలో రాణించేందుకు నేటి యువత ముందుంటుంది. చదువుకుంటూనే నచ్చిన రంగంలోనూ ప్రతిభ చాటుకోవాలని అనుక్షణం తపిస్తుంటారు. అలాంటి పట్టుదలతోనే పెన్సిల్ ఆర్ట్‌లో అద్భుత చిత్రాలకు ప్రాణం పోస్తోంది ఓ ఇంజినీరింగ్ విద్యార్థిని. సినీతారలకు వారి చిత్రాలను బహుమతిగా అందించి వారెవ్వా అనిపించుకుంటుంది. మంగళగిరికి చెందిన ఆ యువచిత్రకారిణి.
మనసులోని భావాలకు రూపమిస్తూ బొమ్మలు వేయడంలో ఒక్కో చిత్రాకారుడిది ఒక్కో పంథా. తనదైన శైలి సృష్టించుకుని ప్రశంసలు అందుకోవాలని కోరుకుంటారు కళాకారులు. ఈ యువతీ అంతే. ఇతరుల కంటే మిన్నగా ప్రతిభ చాటుకోవాలనుకుంది. ఎక్కడా శిక్షణ తీసుకోకున్నా సహజత్వం ఉట్టిపడేలా చిత్రాలు గీస్తూ ఔరా అనిపిస్తోంది.
పెన్సిల్‌తో అందమైన బొమ్మ గీస్తున్న ఈ యువతి పేరు గాయత్రి. నంబూరు V.V.I.T కళాశాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్‌లో ఇంజినీరింగ్ మూడో ఏడాది చదువుతోంది. తండ్రి రమేష్ స్వర్ణకారుడు. తల్లి వెంకటలక్ష్మి గృహిణి. చిన్నప్పటి నుంచే సరదాగా బొమ్మలు వేస్తుండేది. రాను రాను దానినే అలవాటుగా మార్చుకుంది. తల్లి ప్రోత్సాహంతో 8వ తరగతి నుంచి చిత్రకళను శ్రద్ధగా సాధన చేయడం మొదలుపెట్టింది.
కళాశాలలో అడుగుపెట్టిన కొద్ది కాలానికే తల్లి మరణించడంతో కుంగిపోయింది గాయత్రి. అయితే చిత్రకారిణిగా రాణించాలనే అమ్మ ఆశను ఆశయంగా మార్చుకుని తిరిగి బొమ్మలు వేయడం మెుదలుపెట్టింది. కరోనా సమయంలో ఖాళీ సమయం దొరకడంతో తన నైపుణ్యానికి మరింత పదును పెట్టింది.
సదుపాయాలు లేవని ఆగిపోకుండా సమస్యలు సవాలుగా తీసుకుని పెన్సిల్ ఆర్ట్‌లో ఆరితేరింది గాయత్రి. మనసులో అనుకున్న రూపాలకైనా ప్రత్యక్షంగా కనిపించే వ్యక్తుల బొమ్మలైనా ఇట్టే గీసేస్తూ ఆకట్టుకుంటోంది. పెన్సిల్‌తోనే కాక వాటర్ కలర్‌తోనూ అందమైన చిత్రాలు వేస్తోంది.
ఇప్పటివరకూ 500 కు పైగా పెన్సిల్ ఆర్ట్ చిత్రాలను వేసింది గాయత్రి. కళాశాల అధ్యాపకులు, సీనియర్ల ప్రోత్సాహంతో పెయిడ్ ఆర్ట్ వేయటం మొదలుపెట్టానని అంటోంది. వెంకటేష్, విక్రమ్, నవీన్ పోలిశెట్టి, అడివి శేష్ సహా 15 మంది సినీ ప్రముఖులకు వారి చిత్రాలను బహుమతిగా ఇచ్చి ప్రశంసలు అందుకుంది.