Ashwini Vaishnaw on Funds Allocate to AP Railway:ఆంధ్రప్రదేశ్‌కు ఈ సంవత్సరం రైల్వేలకు రూ.9,151 కోట్లు కేటాయించినట్లు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. యూపీఏ ప్రభుత్వంలో కేటాయింపుల కంటే పది రెట్లు పెంచామన్నారు. కేంద్ర బడ్జెట్లో తెలుగు రాష్ట్రాలకు రైల్వే కేటాయింపులపై దిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వివరించారు. రాష్ట్రంలో మొత్తం రూ.73,743 కోట్లతో రైల్వే ప్రాజెక్టు పనులు కొనసాగుతున్నాయని ఆయన స్పష్టం చేశారు. అమృత్ పథకం కింద 73 రైల్వే స్టేషన్లు అభివృద్ధి చేస్తున్నట్టు చెప్పారు. ఏపీలో కూడా వంద శాతం రైల్వేలు విద్యుద్దీకరణ జరిగాయని కేంద్రమంత్రి అన్నారు.
ఏపీ రైల్వే అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని ఆయన స్పష్టం చేశారు. అమరావతి రైల్వే ప్రాజెక్టు పనులు పురోగతిలో ఉన్నాయని చెప్పారు. ఏపీలో పది సంవత్సరాలలో 743 అండర్ పాస్‌లు, పైవంతెనల నిర్మాణం జరిగిందన్నారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్‌కు భూసేకరణ విషయంలో సమస్యలు ఉన్నాయని రైల్వేకు ఇతర భూములు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరామన్నారు. రైల్వేకు భూకేటాయింపులపై ఇటీవల చర్చలు కూడా జరిగాయని వివరించారు. అమరావతిని అనుసంధానిస్తూ 56 కి.మీ మేర రూ.2,047 కోట్లతో ప్రాజెక్టు మొదలు కానుందన్నారు. ఎర్రుపాలెం- కొండపల్లి- నంబూరు మీదుగా రైల్వే లైను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. రైల్వే పనులపై డీపీఆర్‌ను నీతిఆయోగ్ ఆమోదించిందన్నారు. మరిన్ని అనుమతుల కోసం కొంత సమయం పట్టే అవకాశం ఉందని వెల్లడించారు.