Balineni Srinivas Reddy Resigned to YSRCP:నిన్నమొన్నటి వరకు ప్రకాశం జిల్లా వైఎస్సార్సీపీ పెద్దన్నలా వ్యవహరించిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఇప్పుడు షాక్ ఇచ్చారు. వైఎస్సార్సీపీకి రాజీనామా చేశారు. ఇప్పటికే తనకు ప్రాధాన్యం ఇవ్వని పార్టీలో కొనసాగలేనంటూ నేరుగా ఆ పార్టీ అధినేత జగన్‌కే చెప్పిన బాలినేని అన్నంత పని చేశారు. తన దారి తాను చూసుకుంటూ పార్టీకి రాజీనామా చేసేశారు. ఈ క్రమంలో తన రాజీనామా లేఖను జగన్‌కు పంపించారు.
జగన్ విధానాలు నచ్చకే వైఎస్సార్సీపీకి రాజీనామా చేస్తున్నట్లు బాలినేని తెలిపారు. గత కొన్నిరోజులుగా వైఎస్సార్సీపీ అధిష్ఠానం వద్ద అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నానని తెలిపారు. జనసేనలో చేరబోతున్నట్లు తెలిపిన బాలినేని గురువారం ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌ను కలవబోతున్నట్లు వివరించారు.
రాజకీయాలు వేరు, బంధుత్వాలు వేరు. వైఎస్సార్ కుటుంబానికి సన్నిహితుడుని అయినా ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డిని రాజకీయ నిర్ణయాలు సరిగా లేనపుడు ఖచ్చితంగా అడ్డుకున్నా. ఎలాంటి మొహమాటాలకు నేను పోలేదు. అంతిమంగా ప్రజాతీర్పుని ఎవరైనా హుందాగా తీసుకోవాల్సింది. నేను ప్రజా నాయకుడిని, ప్రజల తీర్పే నాకు శిరోధార్యం, రాజకీయాల్లో భాష గౌరవంగా హుందాగా ఉండాలని నమ్మే నిఖార్సైన రాజకీయం చేశాను, కారణం లక్షల మంది ప్రజలు మనల్ని ఆదర్శంగా తీసుకున్నపుడు అన్ని విధాలా విలువలను కాపాడాల్సిన బాధ్యత మనదే.- బాలినేని శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి