Folk Artist Balagam Mogilaiah Died: బలగం చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ జానపద గాయకుడు మొగిలయ్య ఇక లేరు. కొంతకాలంగా కిడ్ని, గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన్ని కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం వరంగల్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలిస్తుండగా, తెల్లవారుజామున 3 గంటలకు కన్నుమూశారు.
కన్నీళ్లు తెప్పించిన మొగిలయ్య పాట: తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లా దుగ్గొండికి చెందిన మొగిలయ్య తన భార్య కొమురమ్మతో కలిసి జానపద పాటలు పాడుతూ జీవించేవారు. ఈ క్రమంలోనే వారిని గుర్తించిన దర్శకుడు వేణు తన బలగం చిత్రంలో క్లైమాక్స్‌లో వచ్చే పాటను కొమురయ్యతో పాడించారు. ఆ పాటను చూసిన ప్రేక్షకులంతా కన్నీళ్లు పెట్టుకోవడమే కాకుండా ప్రాణంపెట్టి ఆ పాట పాడిన మొగిలయ్య దంపతులను అభినందించారు.
గత కొంత కాలంగా ఆరోగ్య సమస్యలు: ఆ తర్వాత కిడ్నీ సమస్యలు వేధించడంతో మొగిలయ్య ఆస్పత్రి పాలయ్యారు. మొగిలయ్య అనారోగ్యం విషయం తెలిసిన బలగం చిత్ర దర్శక నిర్మాతలతోపాటు మెగాస్టార్ చిరంజీవి, పలువురు సినీ రాజకీయ ప్రముఖులు మెరుగైన వైద్యం కోసం మొగిలయ్యకి ఆర్థిక సాయం అందించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా మొగిలయ్యకు మెరుగైన చికిత్స అందించే ప్రయత్నం చేసింది. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఓ అవార్డు వేడుకలో మొగిలయ్య దంపతులను సన్మానించి వారికి ఇంటి స్థలం ఇస్తామని, ఇల్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కూడా వైద్య ఖర్చుల నిమిత్తం లక్ష రూపాయల ఆర్థిక సాయం అందజేశారు.
స్వగ్రామం దుగ్గొండిలో విషాదఛాయలు: మొగిలయ్య మరణం పట్ల బలగం చిత్ర నటీనటులు, దర్శక నిర్మాతలు సంతాపం ప్రకటించారు. మొగిలయ్య- కొమురమ్మ దంపతులకు ఒక కుమారుడు ఉన్నారు. స్వస్థలం దుగ్గొండిలోనే మొగిలయ్య అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. బలగం మొగిలయ్య మృతితో ఆయన స్వగ్రామం దుగ్గొండిలో విషాదఛాయలు అలుముకున్నాయి. మొగిలయ్య మృతి పట్ల బలగం సినిమా దర్శక నిర్మాతలు వేణు, దిల్ రాజు సంతాపం తెలిపారు.
Balagam Actor Died : 'బలగం' నటుడు కన్నుమూత.. దర్శకుడు వేణు ఎమోషనల్