Flash Flood Alerts To Prakasam District :అల్పపీడనం ప్రభావంతో ప్రకాశం జిల్లా వ్యాప్తంగా రెండు రోజుల నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో అల్పపీడనం మరికొద్ది గంటల్లో వాయుగుండంగా మారనుందని ప్రకాశానికి ఫ్లాష్ ఫ్లడ్ ముప్పు పొంచి ఉందని విశాఖ వాతావరణ శాఖ కేంద్రం హెచ్చరించింది. ఈ ప్రభావంతో తీర ప్రాంతంలోని ఒంగోలు, కొత్తపట్నం, నాగులుప్పలపాడు, టంగుటూరు, సింగరాయకొండ మండలాల్లో భారీ వర్షం నమోదు కానున్నట్లు ప్రకటించింది.
దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. అధికారులు తీర ప్రాంత గ్రామాల్లో మంగళవారం విస్తృతంగా పర్యటించారు. విపత్తులను ఎదుర్కొనేలా కోస్తా తీరప్రాంత మండలాల్లో ముందస్తు సహాయక చర్యలు చేపట్టారు. లోతట్టు కాలనీ వాసులను తరలించేందుకు 33 పునరావాస కేంద్రాలను సిద్ధం చేశారు. 214 మందిని అయిదు కేంద్రాల్లోకి తరలించి భోజనం వసతి కల్పించారు. వర్షాల కారణంగా వరుసగా మూడో రోజైన బుధవారం కూడా పాఠశాలలు, కళాశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలకు కలెక్టర్ తమీమ్ సెలవు ప్రకటించారు.
తాళ్లూరు మండలం విఠలాపురం దోర్నపు వాగు కాజ్‌వేపై వరద నీటి ఉద్ధృతి, రాకపోకలు సాగించకుండా పోలీసుల పహారా. (ETV Bharat) బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం - ఏపీకి పొంచి ఉన్న భారీ వాయుగుండం!
తీర ప్రాంత గ్రామాల్లో 60 నుంచి 70 కి.మీ మేర బలమైన గాలులు వీచే అవకాశం ఉన్న నేపథ్యంలో విద్యుత్తు సరఫరాలో అంతరాయాలు నివారించేందుకు 700 స్తంభాలను సంబంధిత అధికారులు సిద్ధం చేశారు. తక్షణమే మరమ్మతులు చేపట్టేందుకు 300 మంది కార్మికులను అందుబాటులో ఉంచారు. అంటువ్యాధులు ప్రబలకుండా అవసరమైన మందులను వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ఆయా గ్రామాలకు తరలించారు. పునరావాస కేంద్రాల్లో వైద్య శిబిరాల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. ఒంగోలు నగర పరిధిలోని పలు కాలనీల్లో వర్షపు నీరు నిలవకుండా పొక్లెయిన్లతో పూడికతీత పనులు కొనసాగిస్తున్నారు.
మట్టిగుంట వాగు పొంగడంతో నీరు నిలిచి చెరువును తలపిస్తున్న ఉప్పుగుండూరు గంగమ్మ కూడలి (ETV Bharat) ఆ మండలాల్లో తస్మాత్ జాగ్రత్త :రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ నుంచి అందిన సమాచారం మేరకు అర్థవీడు, పెద్దదోర్నాల, కంభం, పెద్దారవీడు, మార్కాపురం, రాచర్ల, ముండ్లమూరు మండలాల్లో మంగళవారం రాత్రి నుంచి ఆకస్మిక వరదలు (ఫ్లాష్ ఫ్లడ్స్) వచ్చే అవకాశం ఉన్నట్లు కలెక్టర్ తమీమ్ అన్సారియా తెలిపారు. ఈ మేరకు ఆయా మండలాల్లోని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఆమె కోరారు.
భారీ వర్షాలు (ETV Bharat) బయటికి రావొద్దంటూ హెచ్చరికలు : అయిదు తీరప్రాంత మండలాల్లోని 15 వేల కుటుంబాలపై తుపాను ప్రభావం చూపే అవకాశం ఉందన్న ముందస్తు అంచనాతో నిత్యావసర సరకులను పౌరసరఫరాల శాఖ సిద్ధం చేసింది. ఒక్కో కుటుంబానికి 25 కిలోల బియ్యం, కిలో కందిపప్పు, కిలో పంచదార, లీటరు పామోలిన్‌ను పంపిణీ నిమిత్తం ఆయా చౌక ధరల దుకాణాలకు తరలించారు. ఈ నెల 16న భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిస్తూ వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసిందని కలెక్టర్ తమీమ్ అన్సారియా తెలిపారు. అత్యవసరమైతే తప్ప ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించారు. భారీ వర్షాలు తీర ప్రాంత మండలాల్లోని 18 గ్రామాలపై., మొత్తం 54 ఆవాస ప్రాంతాల్లోని 56,584 మందిపై తీవ్ర ప్రభావం చూపే అవకాశమున్నట్లు వివరించారు. సహాయక చర్యల్లో పాల్గొనేందుకు 30 మందితో కూడిన ఎస్డీఆర్‌ఎఫ్ బృందం జిల్లాకు వచ్చినట్లు తెలిపారు.
125 హెక్టార్లలో పంట నష్టం... (ETV Bharat) 125 హెక్టార్లలో పంట నష్టం :గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో జిల్లాలో 125 హెక్టార్లలోని సజ్జ పంట దెబ్బతిన్నట్లు వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. వెలిగండ్ల, పామూరు, నాగులుప్పలపాడు మండలాల్లోని సజ్జ పంటకు నష్టం వాటిల్లినట్లు జేడీఏ ఎస్.శ్రీనివాసరావు తెలిపారు. వెలిగండ్ల మండలంలో 105 హెక్టార్లు, పామూరు 18, నాగులుప్పలపాడులో రెండు హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నట్లు వివరించారు.
నేలకూలిన వందేళ్ల వేప వృక్షం (ETV Bharat) నేలకూలిన వందేళ్ల వేప వృక్షం :త్రిపురాంతకం మండలం మేడపి వేంకటేశ్వర స్వామి ఆలయ సమీపంలోని వడ్డెర ప్రధాన రహదారి ఎదుట ఉన్న వందేళ్ల వృక్షం రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మంగళవారం విరిగి నేల కూలింది. ఆ ప్రాంతంలో ఉండే వడియ రాజులు ఈ చెట్టును మహాలక్ష్మమ్మగా కొనియాడుతూ పూజిస్తుంటారు.
వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు జిల్లా పోలీసు శాఖ సన్నద్ధంగా ఉందని ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ తెలిపారు. ఇద్దరు అదనపు ఎస్పీలు, డీఎస్పీలు, సీఐ, ఎస్సైలతో జిల్లావ్యాప్తంగా 18 సహాయక బృందాలను ఏర్పాటు చేశామనీ, ఒక్కొక్క బృందంలో సుశిక్షితులైన 20 మంది సిబ్బంది ఉంటారని వివరించారు. లైఫ్ జాకెట్లు, తాళ్లు, డ్రాగన్ లైట్లు, డ్యాటన్లతో పాటు పొక్లెయిన్లు, జేసీబీలను సిద్ధం చేసుకున్నట్లు తెలిపారు. వాగులు, వంకలు, కల్వర్టుల వద్ద పోలీసు సిబ్బందిని నియమించినట్లు చెప్పారు. జిల్లా పోలీసు కేంద్రంలో 24/7 పనిచేసే కంట్రోల్ రూమ్-112 అందుబాటులో ఉంటుందని ఎక్కడైనా, ఎవరికైనా ఇబ్బందులు తలెత్తితే తక్షణ సాయం కోసం డయల్-112తో పాటు పోలీసు వాట్సాప్ నంబర్: 9121102266ను సంప్రదించాలని ఎస్పీ దామోదర్ జిల్లా వాసులకు సూచించారు.
అల్పపీడన ద్రోణి ఎఫెక్ట్ - పలుచోట్ల విస్తారంగా వర్షాలు