Farmers Suffers No Rainfall Conditions in Anantapur District : ఉమ్మడి అనంతపురం జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు అన్నదాతలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. నైరుతి రుతుపవనాలు 5 రోజుల ముందే రాష్ట్రంలోకి ప్రవేశించినా ఆశించిన స్థాయిలో వర్షాలు కురవడం లేదు. దట్టంగా మేఘాలు వస్తున్నా, వర్షం మాత్రం రావడం లేదని రైతులు బాధపడుతున్నారు. ఇప్పటికే సాగు చేస్తున్న పంటలు ఎండిపోతున్నాయని దిగులు చెందుతున్నారు.
వరుణుడి అలక :ఉమ్మడి అనంతపురం జిల్లాలో వరుణుడు ముఖం చాటేశాడు. సుమారు 40 రోజులుగా చినుకు జాడ లేక రైతులు ఆవేదన చెందుతున్నారు. ఎగువన కురిసిన వర్షాలతో తుంగభద్ర జలాశయం గరిష్ట స్థాయికి చేరుకోవడంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. అయితే ఈ నీటిని వరినాట్లకు వినియోగించరాదని, తొలుత ఉమ్మడి జిల్లా తాగునీటి అవసరాల కోసం జలాశయాలు నింపనున్నట్లు అధికారులు ప్రకటించారు. దీంతో రైతులు నిరాశకు గురవుతున్నారు.
రైతులకు మొండి చెయ్యి చూపించిన వ్యాపారులు - రూ.3.40 కోట్లు బకాయి - FARMERS PROTEST FOR CROP CASH
వర్షాలు లేకపోవడంతో రైతుల దిగాలు:ఉమ్మడి జిల్లాలో ఖరీఫ్ సాధారణ సాగు విస్తీర్ణం 8 లక్షల 56 వేల హెక్టార్లు. ఇప్పటి వరకు కేవలం లక్ష హెక్టార్లు మాత్రమే రైతులు సాగుచేయగలిగారు. వ్యవసాయశాఖ అంచనాల ప్రకారం 31 శాతం విస్తీర్ణంలో మాత్రమే రైతులు విత్తనం వేశారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఎక్కువగా వేరుశెనగ సాగు చేస్తుండగా, ఈసారి కేవలం 26 శాతం మాత్రమే సాగు చేశారు. జూన్‌లో కొంతమేర జల్లులు కురిసినా జులైలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఎదురవుతున్నాయి. 61 శాతం లోటు వర్షపాతం నమోదు కాగా, సత్యసాయి జిల్లాలో 41 శాతం వర్షపాత లోటు ఏర్పడింది.