Farmers are Worried about Movement of Elephants : పార్వతీపురం మన్యం జిల్లా ఏనుగుల దెబ్బకు రైతులు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఇప్పటికే పలువురి ప్రాణాలు తీసిన గజరాజులు సోమవారం కొమరాడ మండలం వన్నాంకు చెందిన శివున్నాయుడును పొట్టన పెట్టుకున్నాయి. ఆయన అరటితోటకు వెళ్లి తిరిగొస్తుండగా ఐదు ఏనుగులు దాడి చేశాయి. కాళ్లతో తొక్కేయడంతో తీవ్రంగా గాయపడిన ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనతో ఆ గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
భారీగా పంట, ఆస్తి నష్టం : ఒడిశా లఖేరి అభయారణ్యం నుంచి 2001లో తొలిసారిగా 11ఏనుగులు మన్యం జిల్లాలోకి ప్రవేశించాయి. తర్వాత 2013లో తిరిగి ఒడిశా వెళ్లిపోయాయి. మళ్లీ 2018లో ఒడిశా నుంచి సరిహద్దులో ఉన్న మన్యంజిల్లాకు వచ్చిన గజరాజులు ఇక్కడే తిష్ట వేశాయి. ప్రస్తుతం భామిని, సీతంపేట, జియ్యమ్మవలస, కొమరాడ తదితర మండలాల్లో ఇవి సంచరిస్తున్నాయి. నీరు, ఆహారం మన్యం జిల్లాలో పుష్కలంగా లభిస్తుండటంతో పక్క రాష్ట్రం నుంచి వచ్చిన ఏనుగులు తిరిగి అటువైపు వెళ్లడం లేదు. ఏనుగులు సంచరిస్తున్న ప్రాంతాల్లో భారీగా పంట, ఆస్తి నష్టమూ సంభవించింది.
'తల్లి'డిల్లిన గుండె- గున్న ఏనుగు మృతదేహం వద్ద వేదన- వీడియో వైరల్! - Mother Elephant Tearful Moment
గాల్లో కలిసిపోతున్న ప్రాణాలు : ఏనుగుల దాడిలో మనుషులు, మూగ జీవాల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. 2019నుంచి 2023 ఫిబ్రవరి 14వరకు ఏనుగుల దాడిలో మన్యం జిల్లాలో 12మంది మృతి చెందారు. తాజాగా కొమరాడ మండలం వన్నాంలో శివున్నాయుడు మృతితో ఆ సంఖ్య 13కి చేరింది. వీరిలో ఒక్క కొమరాడ మండలానికి చెందిన రైతులే ఆరుగురు ఉండటం విచారకరం. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక జిల్లా వాసులు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు.